- ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటన
- అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం
- వందల సంఖ్యలో అక్రమ నియామకాలు
- గత ప్రభుత్వంలో నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు
విజయవాడ (చైతన్యరథం): ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థలో అవసరం లేకున్నా ఎక్కువ మంది ఉద్యోగులను గత ప్రభుత్వం నియమించిందని, అలాంటి 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నామని సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఫైబర్ నెట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు 5 ఏళ్లలో అవసరానికి మించి ఎక్కువ మందికి ఏ విధమైన నియామక ఉత్తర్వులు లేకుండా, కనీసం విచారణ కూడా లేకుండానే నాయకులు వాట్సప్ మెసేజ్ పెడితే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఆ విధంగా ఉద్యోగాల్లో చేరిన వారు సంస్థ కోసం పనిచేస్తే ఫర్వాలేదు కానీ, వారు శాసనసభ్యుల ఇండ్లలో వంట పనులు, పార్లమెంట్ సభ్యుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తూ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకుంటున్నారన్నారు. పనేమో వారికి సిఫార్సుల లేఖలు ఇచ్చిన వారి ఇళ్లల్లో చేస్తూ… జీతాలు మాత్రం ఫైబర్ నెట్ కార్యాలయంలో తీసుకుంటున్నారన్నారు. వారికి కనీసం అపాయింట్మెంట్ లెటర్స్ కూడా లేకుండా డైరెక్ట్‌గా పే రోల్స్ లోకి తీసుకున్నారన్నారు. అందుకే అలా గుర్తించిన 410 మందిని తొలగిస్తున్నామన్నారు. ఉద్యోగుల్లో ఇంకా అనర్హులు ఉంటే వారిని కూడా తొలగిస్తామన్నారు. 70-75 శాతం మంది వరకు అవసరం లేకున్నా ఉద్యోగులను తీసుకున్నారన్నారని జీవీ రెడ్డి తెలిపారు.
నిబంధనల మేరకే నిర్ణయాలు
తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగుల పట్ల తనకు ఏవిధమై వ్యతిరేకత లేదన్నారు. అపాయింట్మెంట్ లెటర్స్ లేని వాళ్లను తక్షణమే తొలగిస్తున్నామన్నారు. అలాంటి వారి వల్ల నేడు సంస్థ నెలకు రూ. 4 కోట్లు చెల్లించాల్సి రావడంతోపాటు దివాళా అంచున ఉందన్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండా ఉందని, అలాంటి వారిని ఉపేక్షించకూడదన్నారు. తాము కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదన్నారు. గత ప్రభుత్వం ఫైబర్‌నెట్ సంస్థ పేరిట రూ. 1200 కోట్లు అప్పులు తీసుకుందని, అంతే కాకుండా సంస్థకు రూ. 900 కోట్ల మేర బకాయిలు పెట్టిందన్నారు. అక్రమంగా నియమితులైన ఉద్యోగులను తీయకపోతే సంస్థ రోడ్డున పడుతుందన్నారు. తొలగించిన ఉద్యోగులు ఎక్కువ మాట్లాడినా, ఇబ్బందులకు గురిచేసినా ఇంతవరకూ తీసుకున్న వేతనాలు రికవరీ చేసి, కేసులు పెట్టాల్సి వస్తుందని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులను నియమించిన వారికీ లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎండీ లెక్కలేని తనంగా వ్యవహరించారన్నారు.
లాభాల్లో ఉన్న సంస్థ నష్టాల్లోకి..
ఇలా ఉద్యోగుల నియామకానికి అనుమతులు ఇచ్చిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని, అవసరమైతే వేతనాల కింద తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను రిక్రూట్ చేశారు…దాన్ని సరిచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.. లేకపోతే తాము తప్పు చేసినవారమవుతామన్నారు. లాభాల్లో ఉన్న సంస్థ గత పాలకుల నిర్వాకంతో నష్టాల్లోకి వెళ్లింది.. రూ. 2,160 కోట్ల అప్పులు చేసి వెళతారా అని ప్రశ్నించారు?.. ప్రభుత్వ రంగ సంస్థను ఒక పద్దతి ప్రకారంగా నడపాలన్నారు.
10 రెట్లు పెరిగిన జీతాల వ్యయం
2019కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో 108 మంది ఉద్యోగులకి నెలకు రూ.40 లక్షలు చెల్లించగా గత ప్రభుత్వంలో 1,360 మంది ఉద్యోగులకు నెలకు రూ. 4 కోట్లు చెల్లించారన్నారు. గతంలో కన్నా జీతాలపై చేస్తున్న ఖర్చు 10 రెట్లు పెరిగిందన్నారు. ఈ 5 ఏళ్లలో ఫైబర్ నెట్ సేవలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారన్నారు.. పెరగాల్సిన కనెక్షన్లు 10 లక్షల నుంచి సగానికి 5 లక్షలకు తగ్గి సంస్థను దివాళా అంచుకి తెచ్చారన్నారు. సంస్థలో జరిగిన అక్రమాలపై ఉక్కు పాదం మోపి, పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రభుత్వ కార్పొరేట్ ఆఫీసును ఒక పద్దతి అనేది లేకుండా గత ప్రభుత్వం నడిపిందని జీవీ రెడ్డి తప్పుబట్టారు.