అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు వెలగపూడి సచివాలయంలో సోమవారం కలిశారు. జనవరి 5నుంచి 8 వరకు నాలుగు రోజులపాటు కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వర్ణోత్సవాలకు హాజరవ్వాలని సంఘం అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రచురణ కమిటీ ఛైర్మన్ ఎం.హనుమంతురావు కోరారు. 5వ తేదీ నుంచి జరిగే మహాసభలను ప్రారంభించాలని సీఎం చంద్రబాబును కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో విజయం సాధించిన బొర్రా గోపీమూర్తిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, యూటీఎఫ్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.