- బీసీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రత్యేక రక్షణ చట్టంపై విస్తృత కసరత్తు
- 34శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయ పోరాటం
- నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం కోటా
- బీసీ హాస్టళ్లలో వసతుల కల్పన
- బాలికల హాస్టళ్ల మరమ్మతులకు సీఎం ఆదేశం
- పింఛన్ల తనిఖీ లబ్దిదారుల మంచికే..
- 104 హాస్టళ్లలో ఎస్‌ఆర్ శంకరన్ నాలెడ్జ్ కేంద్రాలు
అమరావతి (చైతన్య రథం): బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టారు. అందరికీ పథకాలు అందిస్తూనే.. బీసీలకు ప్రత్యేకంగా లబ్ధి కలిగించేలా పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరికొంత కసరత్తు తరువాత… సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చట్టాన్ని తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న హామీకి కట్టుబడి ఉన్నామని…. దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని సీఎం తెలిపారు. దీనిపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్లేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారన్నారు. వీటిని పునరుద్ధరించేందుకు న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై సీఎం సమీక్షలో చర్చించారు. న్యాయపరంగా తిరిగి 34శాతం రిజర్వేషన్లు పొందడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కోర్టు తీర్పులు పరిశీలించి….. న్యాయ పరంగా ముందుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు.
సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పన
బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైనా సీపం సమీక్షించారు. బాలికల హాస్టళ్లు తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 1,110 బీసీ విద్యార్థుల హాస్టళ్లున్నాయి. వాటిల్లో బాలురు 58022 మంది, బాలికలు 37794మంది ఉంటున్నారు. ప్రభుత్వ భవనాలు 660 ఉండగా, అద్దె భవనాలు 450 ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టిన రూ.110.52 కోట్ల డైట్ బిల్లుల్లో రూ.76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించగా రూ.34.14 కోట్లు పెండిరగులో ఉన్నాయి. వాటిని కూడా చెల్లించాలని ఆదేశించారు. 2024-25 సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.135 కోట్లు కేటాయించింది. ఆగస్టు నాటికి కాస్మోటిక్ బిల్లులు కూడా రూ.20 కోట్లు పెండిరగులో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.7.10 కోట్లు చెల్లించింది. విద్యార్థుల ట్రంక్ బాక్సులు, ఇతర వస్తువులకుగాను ప్రభుత్వం బడ్జెట్ లో రూ.18 కోట్లు కేటాయించింది. వీటిని త్వరలోనే ప్రభుత్వం కొనుగోలు చేసి విద్యార్థులకు అందించనుంది. డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల చెల్లింపు, ట్యూటర్ ఫీజు, హాస్టళ్ల మైనర్ రిపేర్లను వెంటనే పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. 13 బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసి 5720 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించారు.
త్వరలోనే ఆన్‌లైన్ తరగతులు కూడా చేపట్టనున్నారు. సివిల్స్‌కు ఏటా 100మందికి శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సర్కిల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. సీఆర్డీఏ పరిధిలో 5 ఎకరాలను సివిల్ సర్వీస్ కోచింగ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. దీని కోసం ఇప్పటికే భవనానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం కాగా.. 500మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. 2014-19 మధ్య విదేశాల్లో చదువుకున్న బీసీ విద్యార్థులకు రూ.81.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం నిధులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. వీటి కోసం 2024-25 బడ్జెట్‌లో రూ.36.11 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి జిల్లాల్లో 13 బీసీ భవనాల నిర్మాణాలకు 2016-17లో నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కో భవనం పూర్తికి రూ.5 కోట్లు ఖర్చు కానుండగా పెరిగిన ఖర్చుల నేపథ్యంలో రూ.10 కోట్లు కేటాయించాలని బీసీ నేతలు కోరుతున్నట్టు సమీక్షలో చర్చించారు. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు బీసీ భవనాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. మిగిలిన భవనాల నిర్మాణానికి ఇతర జిల్లాల్లో భూసేకరణ పూర్తిచెయ్యాలని చెప్పారు. బీసీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో రూ.896.79 కోట్లు కేటాయిచింది.
రుణాల మంజూరుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గొర్రెల పెంపకందారులకు అందించాల్సిన చేయూతపైనా సమీక్షలో చర్చ జరిగింది. అదేవిధంగా గత తెలుగుదేశం హయాంలో 13 జిల్లాల్లో కాపు భవన్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ. 2 కోట్ల చొప్పున కేటాయించేందుకు నిర్ణయించింది. అయితే వీటిలో 4 భవనాల నిర్మాణం ప్రారంభం కాగా గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. నిలిచిపోయిన 4 కాపు భవనాలను కూడా పూర్తి చేసేందుకు అవసరమైన రూ.5.40 కోట్ల విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాహ్మిణ్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు వివరించగా…. ప్రతి సామాజిక వర్గానికి ఇలా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ సోసైటీ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు పని చేయాలని సీఎం సూచించారు. ప్రతి సామాజికవర్గంలో ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్నవాళ్లు తమ వర్గానికి ఎంతో కొంత సాయం చెయ్యాలని చూస్తున్నారని… ఇలాంటి వారిని ప్రోత్సహించి ఆర్థికంగా ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న పేదలను పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని సీఎం సూచించారు.
ఎస్‌ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లు
రాష్ట్రంలో త్వరలో ఎస్‌ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. స్కిల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్, నైతిక విలువలు, నీతిశాస్త్రం, డిజిటల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ వంటివి ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు అందించనున్నారు. 26 జిల్లాల్లోని 104 బీసీ హాస్టళ్లలో పైలట్ ప్రాజెక్టులుగా దీన్ని అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ సెంటర్లను ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.
సామాజిక పింఛన్ల తనిఖీ జరపండి..
సమీక్షలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా చర్చ జరిగింది. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేకమంది అనర్హులు ఉన్నారని చర్చ జరిగింది. ఎమ్మెల్యేలతో పాటు..అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టం అవుతోంది. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టారు. దీనిపై సీఎం మాట్లాడుతూ…. అర్హులందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని…ఇదే సమయంలో అనర్హులకు ఫించన్లు ఇవ్వడం సరికాదన్నారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. అనర్హులను తొలగించేందుకు పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలన్నారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కొందరు పింఛన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… దీనిపై అర్హులైన వారు ఆందోళన పడాల్సిన పనిలేదని సీఎం భరోసా ఇచ్చారు. అర్హులకే సాయమనేది తమ విధానమని సీఎం చెప్పారు. మూడునెలల్లో దివ్యాంగుల పింఛన్లపై తనిఖీలు పూర్తి చెయ్యాలని… తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఒకసారి తప్పుడు సర్టిఫికెట్ ఇస్తే…. ఎప్పటికైనా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రూ.15,000 పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇంటికెళ్లి పరిశీలించాలని.. వారు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం సూచించారు. తప్పుడు సర్టిఫికెట్లతో ప్రభుత్వాన్ని మోసం చేస్తే సహించేది లేదన్నారు. సమీక్షలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, సవిత, అధికారులు పాల్గొన్నారు.