- విజయసాయి వియ్యంకుడి లబ్ధికోసమే ట్రూఅప్ చార్జీలు
- నాసిరకం బొగ్గును జెన్కోకు అంటగట్టి నష్టం చేకూర్చారు
- అరబిందో దందాను బయటపెట్టి వాటిని రాబట్టాలి
- 104, 108 అంబులెన్సుల్లో కుంభకోణాలను బయటపెట్టాలి
- విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపించాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి హయాంలో వైసీపీ నాయకుల దోపిడీ పర్వం కారణంగానే నేడు ప్రజలపై భారం పడుతుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ జెన్‌కో కుంభకోణంలో విజయసాయిరెడ్డి, జగన్‌రెడ్డి పాత్ర కీలకమైన వని ధ్వజమెత్తారు. సోమవారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుల దోపిడీలపై విచారణ జరిపేందుకు అన్ని శాఖల్లో సిబ్బంది కూడా సరిపోవడం లేదు..రాష్ట్రాన్ని కుంభకోణాలకు కేంద్రంగా జగన్‌రెడ్డి మార్చడం వల్లే నేడు ప్రజలపై విద్యుత్ భారం పడుతుందని మండిపడ్డారు. కృష్ణపట్నం కోల్ సప్లై, పోర్టులు, ఆంబులెన్స్ సర్వీసులు ఇలా అన్నింటినీ అరబిందోకు జగన్ రెడ్డి కట్టబెట్టాడు. మేము ఏమి చేసినా చెల్లుతుంది.. ప్రజలు ఏమైపోతే నాకేంటి.. ప్రజలపైనే భారం మోపుతాం అన్న చందంగా వ్యవహరించాడు. 15.02.2022న కృష్ణపట్నంలోని 2,400 మెగా వాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ జెన్‌కోకు 4.5 లక్షల టన్నుల బొగ్గును అరబిందో సరఫరా చేసింది. ఆ బొగ్గు మొత్తం మట్టి మషానంతో కలిసి ఉందని..టీఎల్‌ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫాక్టర్ దిగజారిపోయిందని జెన్‌కో ఉద్యోగులు ధర్నా చేశారు. మట్టి మషానంతో కలిసిపోయిందని ఫొటోలతో నేను నిరూపించి ప్రశ్నిం చాను. కృష్ణపట్నం ఓడరేవులో ట్రైడెండ్ అండ్ నాలెడ్జ్ కంపెనీల పేరుతో లక్ష టన్నుల బొగ్గును దిగుమతి చేశారు. దీనిపై కూడా నాడు పోర్టు వద్ద మేము నిరసన చేయడంతో భయపడి బొగ్గు డంప్ చేశారు.
టన్ను రూ.8,500 చొప్పున రూ.382 కోట్లు పెట్టి బొగ్గును ఏపీ జెన్‌కోకు అరబిందో సంస్థ అమ్మింది. జగన్‌రెడ్డి హయాంలో 40 శాతం ప్లాంట్ లోడ్ ఫాక్టర్ ఉండగా ప్రభుత్వం మారాగానే 55 శాతానికి పెరిగింది. నాసిరకం బొగ్గును కొనడం, మార్కెట్ ధర కంటే ఎక్కువ వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయడం వంటి వాటి వల్ల ఏపీ జెన్‌కోకు సుమారు రూ.700 నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిల్లింది. అన్నీ తెలిసి కూడా విజయసాయిరెడ్డి వియ్యంకుడికి ఆదాయం సమకూర్చ డం కోసం ట్రూఅప్, బొగ్గు అంటూ తదితర చార్జీల పేరుతో ప్రజలపై జగన్‌రెడ్డి భారం మోపాడు. పీఎల్‌ఎఫ్ శాతం పడిపోవడంతో పరిశ్రమలు, ఆక్వా పరిశ్రమలకు 24 గంట ల విద్యుత్ అందించలేకపోయాడు. నేడు ఏ అధికారైన లంచం తీసుకుంటే వెంటనే ఏసీబీ చర్యలు తీసుకుంటుంది. అరబిందోకు ప్రత్యేక చట్టమేమీ లేదు. వారు చట్టాలకు అతీతులు కారు. పెద్ద మొత్తంలో అరబిందో సంస్థ కుంభకోణాలకు పాల్పడినట్లు ఆధారా లు ఉంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనిపై సీఐడీ, విజిలెన్స్ విచారణ జరిపి అరబిందో దోపిడీ దందాలను బయటపెట్టి ఏపీ జెన్‌కోకు జరిగిన నష్టా న్ని అరబిందో వద్ద నుండే రాబట్టాలని కోరారు. 104, 108 ఆంబులెన్స్ సర్వీసులలో కూడా అరబిందో కుంభకోణాన్ని అసెంబ్లీ సాక్షిగా నేను బయటపెట్టాను.. దీనిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.