- వజ్రోత్సవాల్లో ‘ముచ్చట్లు’ ఆవిష్కరించిన చంద్రబాబు, వెంకయ్య
- తారకరామం పేరిట సినీ జీవిత విశేషాల పుస్తకం
అమరావతి, (చైతన్యరథం): నటరత్న ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశం 1949లో విడుదలై ఇప్పటికి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆయన సినీ వజ్రోత్సవాలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘తారకరామం-అన్నగారి అంతరంగం’ శీర్షికతో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను విజయవాడలోని పోరంకిలో శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వజ్రోత్సవాల్లో ఆ పుస్తకంతోపాటు రూపొందించిన ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తెదేపా రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ చైర్మన్‌గా ఉన్న ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఈ వేడుకల్ని నిర్వహించింది. కార్యక్రమంలో సినీనటి జయప్రద, నిర్మాతలు డి సురేష్ బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నందమూరి రామకృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాల సమాహారం..
ఎన్టీఆర్ సినీ జీవిత ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, పార్శ్వాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో, ఇంటర్వ్యూల్లో ఆయనే చెప్పిన విశేషాలతో పాటు, ఆయన వ్యక్తిత్వం, నటనా వైదుష్యం, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా విభిన్నపాత్రల్ని సమర్థవంతంగా నిర్వహించిన తీరును ‘తారకరామం’ పుస్తకంలో పొందుపర్చారు. ఆయనతో పనిచేసిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, పాత్రికేయులు, రచయితలు వెల్లడిరచిన అనుభవాల సమాహారంగా తీర్చిదిద్దారు. బీఏ సుబ్బారావు, అట్లూరి పుండరీకాక్షయ్య, కృష్ణకుమారి, సి.నారాయణ రెడ్డి, పేకేటి శివరాం, తాతినేని ప్రకాశరావు, ఎంజీ రామచంద్రన్, పీతాంబరం, రామలక్ష్మీ ఆరుద్ర, డీవీఎస్ రాజు, బీఎన్ రెడ్డి, కొంపెల్ల విశ్వం, గుడిపూడి శ్రీహరి, సత్తెనపల్లి రామమోహనరావు, బాపు-రమణ, బీ మోహన్, గోటేటి వినాయకరావు వంటివారు… ఎన్టీఆర్ గురించి చెప్పిన విశేషాల్ని గుదిగుచ్చి… అందమైన పుష్పగుచ్ఛంలా తీర్చిదిద్దారు. ‘‘పాతళభైరవి సినిమాతో ఎన్టీఆర్‌కు స్టార్ స్టేటస్ సంపాదించి పెట్టిన దర్శకుడు కెేవీ రెడ్డి, ‘మాయాబజార్’ సినిమాతో ఆయనను దైవాంశ సంభూతుడిగా నిలబెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు. ఆ పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు. ఎన్టీఆర్‌లో దైవాన్ని చూడడం మొదలు పెట్టారు. తిరుపతి వెళ్లి వేంకటేశ్వరసామిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా మద్రాసు వెళ్లి ఎన్టీ రామారావు దర్శనం కోసం ఆయన నివాసం ముందు గంటల తరబడి నిరీక్షించేవారు’’ అని ఒక సీనియర్ పాత్రికేయుడు వివరించారు. ఎన్టీఆర్ గురించి ప్రస్తుత తరానికి తెలియని ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
‘‘ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఎందరో సాంకేతిక నిపుణులు, కళాకారులు సమష్టిగా తయారు చేసిన ఒక చిత్రాన్ని అది ఎంత ప్రజాదరణ పొందినా ‘నాది’ అని చెప్పుకోలేను. అందువల్లే దర్శకత్వానికి ఉపక్రమించాను. ఏ చిత్రానికైనా సృష్టికర్త దర్శకుడే కదా. దర్శకత్వంలో నాకు గురువు అంటూ ఎవరూ లేరు. ఏ ఒక్కరి పద్ధతీ నేను అనుసరించను. నాదంటూ సొంతమైన ఒక పద్ధతి రూపొందించుకున్నాను’’… తాను దర్శకుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందీ వివరిస్తూ ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇవి. ఆయన అంతరంగాన్ని వెల్లడిరచే ఇలాంటి విశేషాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. నాటి తెలుగు సినిమా పరిశ్రమలో తన సమకాలికులైన మేటి దర్శక, నిర్మాతల నుంచి తాను నేర్చుకున్న వృత్తిగతమైన, వ్యక్తిగతమైన జీవితానుభవాల సారాన్ని ఆయన మాటల్లోనే ఈ పుస్తకం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.
కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు ఆడవేషం వేయమంటే ఎక్కడలేని పౌరుషం వచ్చేది. వేడి, వాడి గల పాత్రలు నాకు చాలా ఇష్టం. బెజవాడ కాలేజీలో మా మాస్టారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నా చేత ఆడవేషం వేయించాలని పట్టుపట్టడం- అదో గమ్మత్తు కథ. రాచమల్లుని దౌత్యంలో నాగమ్మపాత్ర నాకు ఇచ్చారు. పౌరుషానికి కావాలంటే మీసం తీయకుండానే ఆ పాత్ర ధరిస్తానని భీష్మించాను. అలా భీష్మించే అలవాటు అప్పటికీ, ఇప్పటికీ నాలో ఉంది.’’- 1961లో ఆంధ్ర సచిత్ర వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు చెప్పిన విశేషం ఇది. ఎన్టీఆర్‌కు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న బిరుదును అప్పటి కంచి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రసాదించారని చెబుతారు. సీతారామ కల్యాణం సినిమాలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని తెలుసుకుని, ఆయన ఆ సినిమా చూశాక ఆ బిరుదు ప్రదానం చేశారని చెబుతారు.’’
ఎన్టీఆర్‌పై రాసిన వ్యాసంలో ఒక పాత్రికేయుడు వెల్లడిరచిన విశేషం ఇది..
ఆయన కార్యశూరుడు, తలపెట్టిన ఏ పనైనా అనుకున్న సమయానికి జరగాల్సిందే. సినిమా షూటింగ్ సమయంలో ఆ పాత్ర ధ్యాస తప్పితే, ఇతర వ్యాపకం ఉండదు. అనవసరంగా మాట్లాడుతూ కూర్చోరని, సెట్లో పని చకచకా జరుగుతుందని, అందరూ ఏకాగ్రతతో ఉంటారని కొందరు నిర్మాతలు, దర్శకులు అనడం స్వయంగా విన్నాను. ఆయన వల్ల షూటింగ్ రద్దయిందనో, ఆయన కోసం నిరీక్షిస్తున్నామనో ఎవరూ ఎప్పుడూ అనలేదు.’’1962లో సినిమారంగం పత్రికలో ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
గత పుస్తకాలకు భిన్నంగా..
ఎన్టీఆర్ జీవితంపై ఇప్పటి వరకు పలు కోణాల్లో పుస్తకాలు వచ్చినా… నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు సందర్భాల్లో, పలు అంశాలపై ఎన్టీఆర్ వ్యక్తం చేసిన ఆయన మనసులోని భావాలకు ఎవరూ స్పృశించని విధంగా ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చారు. కేవలం సినిమా విశేషాలే కాకుండా… ఎన్టీఆర్ జీవిత ప్రస్థానం, కుటుంబ నేపథ్యం గురించిన విశేషాల్ని కూడా పొందుపరిచారు. 1949లో ‘మనదేశం’ చిత్రంతో ప్రారంభించి… 1993లో ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ వరకు 303 చిత్రాల్లో వైవిధ్యభరితమైన, స్ఫూర్తిమంతమైన పాత్రలకు ఆయన జీవం పోసిన తీరును కళ్లకు కట్టారు. సినీపరిశ్రమ హైదరాబాద్‌లో నిలదొక్కుకోవడానికి ఎన్టీఆర్ చేసిన ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు, ఆ క్రమంలో ఎదురైన అనుభవాలు, విమర్శలు… ఈ మొత్తం ప్రయాణంలో ఆయన అనుభవించిన మానసిక సంఘర్షణకు అక్షరరూపంలో ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన చేయూత, ప్రోత్సాహకాల వివరాలు పొందుపరిచారు. ‘తారకరాముని అపురూప చిత్రాలు’ శీర్షికతో ఆయన బాల్యం నుంచి.. ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు ఆయన సినీ, రాజకీయ జీవితంలో అనేక మంది ప్రముఖులతో ఉన్న అరుదైన చిత్రాల్ని పొందుపరిచారు. ఎన్టీఆర్ నటించిన, దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాల జాబితాలతో పాటు… ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు, జానపద చిత్రాలు, 100 రోజులు, 175 రోజులు ప్రదర్శించిన చిత్రాలు, స్వర్ణోత్సవ, వజ్రోత్సవ చిత్రాలు… ఇలా విడివిడిగా జాబితాలుగా ఇచ్చారు.