విజయవాడ (చైతన్యరథం): అసెంబ్లీకి వెళ్లని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అని అభివర్ణించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ఆయా నియోజకవర్గాల సమస్యలను ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాలి. అయితే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ఆ ప్రజలనే అవమానిస్తున్నారు. అసెంబ్లీకి రాకున్నా ఆ 11 మందికి ప్రతినెలా లక్షా 75వేల రూపాయలు వారి ఖాతాల్లో పడుతున్నాయి. ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు.. అసలు అసెంబ్లీకి వెళ్లనేలేదు. ఇక నుంచి ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేము మేకలుగా పరిగణిస్తాం. వైసీపీలో 11 మేకలు ఉన్నాయి.. ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని చెప్పాల్సి ఉంది. వారిలో ఒక పెద్ద మేక ఉంది… ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చెబుతారో తెలియదు. గతంలో సీఎంగా పని చేసిన ఆ వ్యక్తికి ప్రజలు తగిన బుద్ది చెప్పడంతో.. బెంగళూరుకు పారిపోయారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని మిమ్మలను ఎమ్మెల్యేగా గెలిపించారు. అసెంబ్లీకి వెళ్లని మీకు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలని బుద్దా డిమాండ్ చేశారు.
ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు
గతంలో చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారంటే.. దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు మీరు నిండు సభలో ఆయనను, ఆయన కుటుంబాన్ని అవమానించారు కాబట్టి అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. మిగతా సభ్యులంతా అసెంబ్లీకి వెళ్లి.. ప్రజల తరపున గళం విప్పారు. వారివారి నియోజకవర్గాలలో ప్రజా సమస్యలపై ప్రస్తావించారు. జగన్ తల్లిని, భార్యను ఎవరైనా ఏమన్నారా.. మీలాగా బూతులు తిట్టారా. జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దానికి వైసీపీలోని మిగతా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి రానివ్వడం లేదు. ప్రజలు 18 సీట్లు ఇస్తే.. ప్రతిపక్ష హోదా వచ్చేది. ఇదే విషయాన్ని గతంలో జగనే స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు కదా. ఇకనైనా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి.. ప్రజల తరపున మాట్లాడాలి. వెళ్లేది లేదంటే.. ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కి ఇచ్చి, రాజీనామాలు చేయాలి. అసలు అసెంబ్లీకి వెళ్లని మిమ్మలను ఎమ్మెల్యేలుగా ఎలా పరిగణించాలి. ప్రజల తరపున నిలబడని మీకు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత కూడా లేదని బుద్ధా అన్నారు.
ప్రజలే నిలదీయాలి
చంద్రబాబుకు జరిగిన అవమానంతోనే ఆనాడు అసెంబ్లీ కి రానని శపథం చేశారు. మళ్లీ సీఎంగా మాత్రమే అడుగు పెడతానని చెప్పి వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో పట్టం కట్టారు. నేడు అసెంబ్లీలో సీఎంగా ఆయన పని తీరును ప్రజలంతా హర్షిస్తున్నారు. మంగమ్మ శపధం అంటూ ఆనాడు నోరు పారేసుకున్న కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ. చంద్రబాబుది చాణక్య శపథం కాబట్టే.. ప్రజలు కూడా అండగా నిలబడ్డారు. అడ్రస్ లేకుండా పోయినా కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకి తెలియ చేస్తే 1,116 బహుమానం ఇస్తాం. వారి ఆచూకీ తెలిసి, పోలీసులకు అప్పగిస్తే.. తప్పకుండా బహుమానం ఉంటుంది. జగన్ విధానాలు, పోకడనలు నచ్చక అనేక మంది వైసీపీని వీడి బయటకు వస్తున్నారు. వైసీపీ త్వరలో పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయం. తన పని అయిపోయిందని భావించిన జగన్.. బెంగళూరుకు పూర్తిగా మకాం మార్చాలని చూస్తున్నారు. జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు. అయినా ఎవరూ భయపడకుండా చంద్రబాబుకు అండగా నిలబడి.. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. నేను కూడా దమ్ముగా నిలబడ్డా. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ.. పార్టీకోసం, చంద్రబాబు కోసం పని చేశాను. అధికారం కోల్పోగానే మీలాగా మేము పారిపోయి దాక్కోలేదు. చంద్రబాబు గతంలో ఓటమి చెందినా.. ప్రజల కోసం నిలబడ్డారు. ఒక్క ఓటమితోనే జగన్‌తో పాటు, ఆ రోజు నోరు పారేసుకున్న వారంతా తోక ముడిచారు. మీకు అధికారం, పదవులు ఉంటేనే రంకెలు వేస్తారా. పదవులు పోగానే.. ప్రజలను పట్టించుకోకుండా పారిపోతారా? జగన్ చేసిన పాపాలకు.. ప్రజలు తగిన బుద్ది చెప్పారు. ఇంకా సిగ్గు లేకండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. ప్రజలు కూడా నియోజవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. ఓట్లు వేసి గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్లి సమస్యలను ఎందుకు ప్రస్తావించటం లేదని ప్రశ్నించాలి. ప్రజల తీర్పుకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.