- విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య
- 26 జిల్లాల్లోనూ బీసీ భవన్‌ల నిర్మాణం
- తిరుపతి బీసీ బాలికల హాస్టల్ సందర్శన
- అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి
తిరుపతి (చైతన్యరథం): బీసీ హాస్టళ్ల విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి హాస్టల్‌లోనూ, గురుకుల పాఠశాలల్లోనూ ఇన్వర్టర్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి నగరంలోని బీసీ బాలికల హాస్టల్‌ను మంత్రి సవిత సందర్శించారు. హాస్టల్లో ప్రతి గదిని, బాత్ రూమ్‌లను, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.39 వేల కోట్లకు పైగా కేటాయించిందన్నారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బీసీల అభ్యున్నతికి అత్యధిక నిధులు కేటాయించామన్నారు. అందులో భాగంగా బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.25 కోట్లు కేటాయించామన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యంగా నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండేలా హాస్టళ్లల్లో ఇన్వర్టర్లతో పాటు విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణంతో పాటు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే తమ పిల్లలను బీసీ హాస్టళ్లకు పంపుతున్నారో…అదే భరోసాతో విద్యార్థులను కంటకి రెప్పలా కాపాడుతున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
26 జిల్లాల్లోనూ బీసీ భవనాల నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ బీసీ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బీసీ భవన్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ భవనాలన్నీ 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయన్నారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవన్‌లతో పాటు కొత్త జిల్లాల్లోనూ నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను కూడా గాలి కొదిలేసిందన్నారు. హాస్టళ్ల మరమ్మతులకు రూపాయి కూడా నిధులివ్వలేదని, చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని అన్నారు. రంగుల రెడ్డి.. భవనాలకు రంగుల వేయడంపై చూపిన శ్రద్ధ హాస్టళ్ల నిర్వహణపై చూపలేదని జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టళ్ల భవనాలకు రంగు మార్చో…పేరు మార్చో…నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే బీసీ విద్యార్థులకు ఎంతో మేలు కలిగేదన్నారు. గత 5 ఏళ్లు బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేసి..బీసీ ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపార వేత్త
రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందజేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. బీసీ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో హాస్టళ్లను సందర్శించినప్పుడు…తీవ్రమైన సమస్యలను గుర్తించామన్నారు. విద్యార్థులకు డైట్ బిల్లులు కూడా రాలేదని వార్డెన్లు తెలిపారన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి…డైట్ బకాయిలు చెల్లించామన్నారు. ఇప్పుడు అన్ని హాస్టళ్లలోనూ నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందిస్తున్నామని మంత్రి సవిత వివరించారు.
పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా…
అంతకుముందు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి సవిత నివాళులర్పించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు. మద్రాసులో తెలుగువారి అవమానాలను భరించలేక…58 రోజుల పాటు ఆమరణదీక్ష చేసి ఆత్మబలిదానం చేశారన్నారు. అటువంటి మహానుభావుని పోరాట స్ఫూర్తితో విద్యార్థినులు ముందకు సాగాలన్నారు. పొట్టి శ్రీరాములు పట్టుదల, అంకుఠిత దీక్ష నేటి తరం యువతకు ఎంతో అవసరమన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరమూ కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, టీడీపీ బీసీ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, కృష్ణ యాదవ్, ఎంప్లాయ్ అసోసియేషన్ అధ్యక్షుడు మునిబాల, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.