- జీరో డ్రాపవుట్స్, విద్యార్థుల నమోదుపై దృష్టి సారించాలి
- మధ్యాహ్న భోజనం, హాస్టల్ మెస్‌ల్లో నాణ్యత పెంచాలి
- వందరోజుల యాక్షన్‌ప్లాన్‌కు అనుగుణంగా చర్యలు
అమరావతి(చైతన్యరథం): గత ఐదేళ్లలో విద్యారంగాన్ని పట్టించుకోలేదు…రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు, ఫలితాలపై దృష్టిసారించి ఏపీ మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుం బిగించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెండోరోజు గురువారం మానవవనరుల శాఖపై సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి… జీరో డ్రాపవుట్స్ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ స్కూళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు, విద్యాపరమైన ఫలితాలకు పొంతన ఉండటం లేదు. పారదర్శకమైన విధానాలతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు, విద్యాపరమైన ఫలితాల్లో పురోగతిని పొందుపరుస్తూ జిల్లాలవారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులను అందజేస్తున్నాం. రాబోయే వందరోజుల యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా అధికారులు దృష్టిసారించాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు.. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై దృష్టి సారించాలి.
పోషకవిలువలు కలిగిన పౌష్టికాహారం అందజేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం లోకల్ మెనూతో మధ్యాహ్న భోజనం అందించే వెసలుబాటును కలెక్టర్లకు కల్పించాం. ఉన్నత విద్యలో కూడా హాస్టల్, భోజన సౌకర్యాలపై దృష్టిపెట్టాలి. ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. హాస్టళ్లలో శానిటేషన్ నిర్వహణ, కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఇందుకోసం ప్రతివారం విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే విధానాన్ని చేపట్టాం. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మెస్, సౌకర్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. పాఠశాలలు, కళాశాలల్లో మత్తుపదార్ధాల నివారణకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాం. అన్ని స్కూళ్లు, కాలేజీల్లో ఈగల్ టీమ్స్, క్లబ్స్ ఏర్పాటు చేసి పెద్దఎత్తున విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. కేజీ టు పీజీ కరిక్యులమ్ ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నాం. అపార్ ఐడీ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. దీనివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక సమస్యలు అధిగమించి పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులంతా కృషిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.