- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన ప్రతిభా భారతి, గల్లా మాధవి
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో భూ కబ్జాలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.
` తన పొలాన్ని కబ్జా చేసి తనపై దాడి చేస్తూ చంపేందుకు చూస్తున్న కబ్జాదా రులు, వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని తన భూమిని విడిపించి న్యాయం చేయాలని బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన సిడెపూడి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
` ఎస్సీ, ఎస్టీలమైన తమకు గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేయగా 2019లో రద్దు చేశారని..తమకు మళ్లీ ఇళ్ల స్థలాలను కేటాయించి ఇవ్వాలని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు.
` సంతమాగలూరు మండలంలోని తమ స్వగ్రామం ఫతేపురంలో తమకు 1.56 సెంట్ల భూమి ఉందని.. ఆ భూమిని సర్వే చేయమని ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా సర్వేయర్లు పట్టించుకోవడం లేదని గుంటూరులో నివాసం ఉంటున్న యాగాల కోటే శ్వరరావు ఫిర్యాదు చేశారు. తమ భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
` తమ భూమిని అక్బరాబాద్ అనే వ్యక్తి గతంలో కబ్జా చేశాడని.. దానిపై ఎవరిని న్యాయం అడిగినా నాడు పట్టించుకోలేదని నెల్లూరు జిల్లా అనుమసముద్రం మండలం చిరమన గ్రామానికి చెందిన చల్లకొలుచు మాలకొండయ్య ఫిర్యాదు చేశాడు. తన భూమి ని విడిపించి న్యాయం చేయాలని కోరారు.
` గతంలో రేపల్లె మండలం రాజుకాలువ గ్రామంలో తన తండ్రికి గతంలో ప్రభు త్వం ఇచ్చిన భూమిపై తమకు హక్కులు కల్పించాలని అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని కృష్ణా జిల్లా గుడివాడ మండలం మందపాడుకు చెందిన కర్ర యోహాన్ వాపోయారు. ఇప్పటికీ తమ తండ్రి పేరే ఆన్‌లైన్‌లో ఉండగా అధికారులు మాత్రం మీకు ఇక్కడ భూమి లేదని మాతో అబద్ధాలు చెబుతున్నారని వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
` నంద్యాల మండలం కొత్తపల్లెలో తన భర్త పేరు మీద ఉన్న భూమిలో ఒక ఎకరా అమ్ముకుని తన కూతురికి పెళ్లి చేసుకోగా ఆ పొలంలో భాగం ఉందంటూ తన భర్త చిన్నాన్న కొడుకు, తన భర్త చెల్లెలు తమపై దాడి చేసి ఇంటికి తాళం వేశారని నంద్యాల టౌన్‌లోని ఉప్పరిపేటకు చెందిన పసుపులేటి లక్ష్మీదేవి వాపోయింది. వారికి సంబంధం లేకపోయినా కోర్టుకు వెళ్లారని..సమస్య కోర్టులో ఉన్నా కూడా తమను బెదిరి స్తున్నా రని ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.