అమరావతి (చైతన్య రథం): ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని అన్నారు. సీఎం చంద్రబాబు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్షగా అభివర్ణించారు. ‘‘ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయి. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది. మంత్రి లోకేశ్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. గూగుల్ ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు సంబంధించి బుధవారం గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందన్నారు. రాష్ట్రంలోని యువతతో సహా అందరికీ డిసెంబర్ 11 ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. గూగుల్‌తో ఎంవోయూ ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారి, రాష్ట్రానికి గేమ్‌ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ వంటివి వస్తే ప్రపంచం చూపు విశాఖవైపు ఉంటుందన్నారు. నాలెడ్జ్ సొసైటీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనుకుంటున్నామని, ఆర్టీజీఎస్‌తో గూగుల్‌ని అనుసంధానం చేస్తున్నట్టు, ఇది ప్రభుత్వంలో పెద్ద మార్పు తీసుకువస్తుందన్నారు.
హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులనూ దారి మళ్లించారు. నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చాం. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. అమరావతి కోసం ఇప్పటికే రూ.31 వేల కోట్లు సేకరించాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.