- వచ్చే మార్చి 1 నుండి 20 వరకు పరీక్షలు
- విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ఇంటర్‌మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది (2025) మార్చి 1 నుండి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ శుభాభినందనలు తెలియజేశారు. విద్యార్థులు పరీక్షల సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించి, ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ఒత్తిడికి లోను కాకుండా, ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సన్నద్ధమై పరీక్షల్లో అత్తుత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.