- ఏపీ పునర్నిర్మాణానికి కలిసి పనిచేద్దాం
- ముఖ్యమంత్రి తపనంతా రాష్ట్ర అభివృద్ధి గురించే
- ఆయన పనితీరు అందరికీ మార్గదర్శకం
- జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆర్థికమంత్రి పయ్యావుల
అమరావతి (చైతన్యరథం): ఏపీని పునర్మించేందుకు అందరం కలిసి పనిచేద్దామని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడూ అదే తపనతో రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్నారు. ప్రజల కోసమే జీవితం, ప్రతి పనిలోనూ మానవత్వం అనే లక్ష్యంతో పాలన అందిస్తున్నారని తెలిపారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ఈ సమావేశంలో చర్చిద్దామన్నారు. సీఎం చంద్రబాబు సూచనలు, సలహాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేద్దాం. 1994 నుండి అంటే దాదాపు 30 ఏళ్ల నుండి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నాం. ఆయన పనితీరు అందరికీ మార్గదర్శకమని మంత్రి కేశవ్ అన్నారు.
అప్పే ప్రధాన సమస్య
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు అని తెలిపారు. ఆ ఇబ్బందులు అధిగమించి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక శాఖ సమస్యలు, లక్ష్యాలకు సంబంధించి ఆయన ప్రధానంగా వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిన పరిస్థితి ఉంది. అంతకుముందు రెండేళ్లు 107 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించిన పరిస్థితి ఉండేది. ఒక లక్షా 14 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తాజాగా రెండు జిల్లాల్లో రివ్యూ చేశాను. వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా బాధనిపిస్తోంది. కేసీ కెనాల్‌కు రూ.3 కోట్లు ఖర్చు పెడితే సరిపోయేది, కానీ అది కూడా చేయలేదు. దీంతో కేసీ కెనాల్ గత ఐదేళ్లలో నాశనం అయిందని మంత్రి కేశవ్ అన్నారు.
చంద్రబాబు అడుగుజాడల్లో నడుద్దాం
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి.. కానీ సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారు. నేను ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ స్థాయికి రావడం వెనుక సీఎం చంద్రబాబు అందించిన ప్రోత్సాహం ఎంతో ఉంది. మనమంతా ఆయన అడుగుజాడల్లో పని చేద్దాం. ఆయన హైదరాబాద్‌ని ఎలా అభివృద్ధి చేశారనేది గమనించండి. ఈ రాష్ట్రాన్ని కూడా మళ్లీ పరుగులు పెట్టిస్తారు. 10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేని విజ్ఞానాన్ని మనం చంద్రబాబు వద్ద నేర్చుకోవచ్చు. చంద్రబాబు వద్ద పనిచేయడం ఒక గొప్ప అవకాశమని మంత్రి కేశవ్ అన్నారు.
సీఎం టీమ్‌గా ప్రజల కోసం కష్టపడదాం
ప్రతి రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నాం. మిగిలిన శాఖలు కూడా ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. ముఖ్యమంత్రి ఈ ఆరు నెలల్లో మూడు నెలల పాటు తన డిన్నర్‌ని సెక్రటరియేట్ లోనే చేశారు. ఆయన ఎందుకు అంత కష్టపడుతున్నారు అంటే ప్రజలకు సేవ చేయాలి, పని చేయాలి అనే తపన. ఆయన పని చేస్తున్న తీరు చూస్తే, రాష్ట్ర అభివృద్ధిపై తిరిగి నమ్మకం కలుగుతోంది. ఈ రాష్ట్రాన్ని పునర్మించడానికి మనవంతు పని చేద్దాం. మన సీఎం టీమ్ గా.. ప్రజల కోసం పనిచేద్దాం. రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించే అధికార బాధ్యతల్లో మీరున్నారు.. దీన్ని సద్వినియోగం చేసుకుందామని మంత్రి కేశవ్ పిలుపు ఇచ్చారు.