– ఆయన విజన్ ఫలితమే నేటి సైబరాబాద్
– ఆయన నేతృత్వంలో పనిచేయడం మన అదృష్టం
– ప్రజల మేలు కోసం, రాష్ట్రం బాగు కోసం సమష్టిగా పని చేద్దాం
– పాలసీలు ఎంత మంచివైనా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది
– గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు
– గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు బాధాకరం
– క్షేత్ర స్థాయిలో తప్పులను నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే
– జిల్లా కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి (చైతన్యరథం): గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయాయి.. వ్యవస్థలన్నింటినీ నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆవహించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికే చాలా సమయం వెచ్చించాల్సి వస్తోందన్నారు. శాఖాపరంగా సమీక్షలు చేస్తున్నప్పుడు గత ఐదేళ్లలో వ్యవస్థలు ఎంత దారుణంగా పని చేశాయనేది బయటపడుతోందన్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలని, ప్రజల బాగు కోసం, రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలని ఆకాంక్షించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకప్పుడు సైబరాబాద్ ప్రాంతం రాళ్లు, రప్పలుగా ఉండేది.. ఆ రాళ్లు, రప్పల్లోనే భవిష్యత్తును చూపిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో, మార్గదర్శకంలో మనమంతా పనిచేయడం అదృష్టంగా భావించాలి. రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకున్న విజన్ అద్భుతం. దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తే రాష్ట్రం కచ్చితంగా అభివృద్ధి ఆంధ్రగా మారుతుంది. మీ చేతిలో అతి పెద్ద జిల్లా వ్యవస్థలున్నాయి. వాటిని ప్రజల కోసం, ప్రభుత్వ పాలసీలను వారికి అందించడం కోసం బలంగా పని చేయించే బాధ్యత మీ మీద ఉంది. దాన్ని పటిష్టంగా అమలు చేసేలా చూడండి. అంతా కలిసి వ్యవస్థలను బలోపేతం చేద్దాం. సరికొత్త ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు సమష్టిగా ముందడుగు వేద్దామని పవన్ పిలుపు ఇచ్చారు.
ప్రజల అభ్యున్నతి కోసం పాలసీలు తాసుకురావాల్సిన బాధ్యత పాలకులుగా మాపై ఉంటే… వాటిని అంతే సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థగా కలెక్టర్లపైన ఉంటుందన్నారు. అప్పుడే ప్రజలకు మంచి పాలన, సుస్థిరమైన అభివృద్ధి సమపాళ్లలో అందుతుంది. గత ఐదేళ్లుగా ఈ పద్ధతి పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సాగిన అప్పటి పాలనను కలిసికట్టుగా ఎదుర్కోవాలనే గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి వారి ఆశీర్వాదం పొందాం. గత ప్రభుత్వ హయాంలో మేము ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొనే ముందుకు వెళ్లాం. అప్పటి పాలకులు చట్టాలు, నిబంధనలు పట్టించుకోలేదని పవన్ విమర్శించారు.
కళ్ల ముందే తప్పు జరుగుతున్నా స్పందన లేదు
రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను నియంత్రించే శక్తి ఉన్న బ్యూరోక్రసీ కూడా నిస్సహాయంగా ఉండటం చూసి బాధ కలిగింది. ఇంతమంది బ్యూరోక్రాట్లకు అప్పట్లో జరిగిన అన్యాయాలను ఎదిరించే ధైర్యం లేకపోయింది. ఆ నిస్సహాయత నుంచే మేం రోడ్ల మీదకు వచ్చి ప్రజల తరఫున పోరాడాం. సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక వరకు, మద్యం అమ్మకాల దగ్గర నుంచి సహజ వనరుల దోపిడీ వరకు కళ్లముందే తప్పు జరుగుతున్నా అప్పట్లో ఎవరూ స్పందించలేదు. కష్టపడి సివిల్స్ పాసై ముస్సోరిలో ఐఏఎస్, హైదరాబాద్ లో ఐపీఎస్ శిక్షణ పొంది, పాలనలో నిష్ణాతులుగా బయటకు వచ్చే అధికారులు గత ప్రభుత్వంలో ఏం జరిగినా మౌనంగా ఉండిపోవడం చూసి ఆశ్చర్యమేసేది. సిరియా, శ్రీలంక వంటి దేశాల్లో పాలకులు విఫలమైనా కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా నిలబడి పరిస్థితిని చక్కదిద్దింది. గత ప్రభుత్వ పాలకులు చేసిన ఎన్నో ఆకృత్యాలకు ప్రజలు బలయ్యారు. ఇప్పుడు కుప్పలుతెప్పలుగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే బాధేస్తోంది. జీతభత్యాలు లేక ఉద్యోగులు, సిబ్బంది బాధపడ్డారు. ప్రజలకు అన్ని విషయాల్లోనూ బాధలు ఎక్కువయ్యాయి. సత్యసాయి జిల్లాలో వాటర్ స్కీమ్‌లో పని చేసే క్షేత్ర స్థాయి సిబ్బందికి వేతనాలు నెలల తరబడి అందలేదని నా దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాం. అలాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా పనిచేయాలి. అప్పుడే అన్ని వర్గాలకు సరైన మేలు జరుగుతుంది. ప్రజలలో ఇప్పుడు బలమైన చైతన్యం ఉంది. ఏ తప్పు జరిగినా వారు తిరగబడతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యాన్ని వీడి, సీరియస్‌గా పని చేయాలని పవన్ పిలుపు ఇచ్చారు.
మూడు చెక్ పోస్టులు పెట్టినా ఆగని స్మగ్లింగ్
కాకినాడ పోర్టులో ఇటీవల నేను పర్యటించినప్పుడు అక్కడ బియ్యం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు చూసి షాక్ అయ్యాను. నేను పర్యటించక ముందు చాలాసార్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ నేను వెళ్లి స్వయంగా పరిశీలించిన సందర్భంగా ఎన్నో అవకతవకలు నా దృష్టికి వచ్చాయి. స్మగ్లింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా జరగడం చూసి వ్యవస్థలు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నాయో అర్థమైంది. పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలను అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తోంది. అక్కడున్న కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీపైన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిన బాధ్యత ఉందని పవన్ అన్నారు.
స్మగ్లింగ్ నిరోధించకపోతే…
కేవలం బియ్యం స్మగ్లింగ్ కోసం మాత్రమే నేను మాట్లాడలేదు. స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు నిరోధించలేకపోతే దేశానికి హాని కలిగించే తీవ్రవాద మూకలు, పేలుడు పదార్థాలు సులభంగా తీరం నుంచి రావడానికి ఆస్కారం ఉంది. 2008లో కసబ్ లాంటి తీవ్రవాదులు ముంబై పోర్టు నుంచి దేశంలోకి వచ్చి 300 మంది ప్రాణాలు బలిగొన్నారు. కాకినాడ పోర్టు భద్రంగా లేకపోతే అలాంటివి జరగవు అని గ్యారెంటీ ఏంటి? కేవలం అక్రమ బియ్యం నిరోధం పైనే కాకుండా రాబోయే విపత్తులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పవన్ వివరించారు.
ఏపీ సివిల్ సర్వీస్ అధికారులు నాడు ` నేడు
నేను చెప్పేది ఒక్కటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం సమన్వయంతో పని చేయాల్సిన సమయం ఇది. మీరు మరింత జాగ్రత్తగా పని చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం మీద చాలాసార్లు సమీక్షలు చేసి పలు సూచనలు చేశారు. నేను కూడా పలు శాఖలపై, వాటి పని తీరుపై ప్రభుత్వ విధానాలను బ్యూరోక్రాట్లకు తెలియజేస్తున్నాను. వ్యవస్థల్లో చాలా నిర్లక్ష్యం పేరుకుపోయింది. దీన్ని పూర్తిగా తొలగించాలి. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. దానిని మీ సహకారం లేకుండా మేము చేరుకోలేమని భావిస్తున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారులంటే దేశం మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా ఉండేవారని, ఇటీవల ఢల్లీి పర్యటనలో కూడా కొందరు పెద్దలు చెప్పారు. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సివిల్ సర్వీస్ అధికారులు ఎలా ఉండకూడదో ఆంధ్ర అధికారులను చూపిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. మీరు ప్రజలకు మంచి చేస్తే మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మీ ఆలోచనలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేవి అయితే మేము వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మీ పర్యవేక్షణలోనే అమలు జరిపిస్తామని పవన్ చెప్పారు.