- విజయవాడ సీపీకి టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు
- సీఎంని బెదిరించేలా విజయసాయి మాటలు
- అవసరమైతే కోర్టుకు వెళతామని స్పష్టీకరణ
- నోరు అదుపులో పెట్టుకోకుంటూ మూల్యం చెల్లిస్తారు
విజయవాడ (చైతన్యరథం): సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబును కలిసి విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. విజయసాయికి సిగ్గు, శరం అనేవి లేవన్నారు. కనీసం మనిషిలా కూడా మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అప్పటికి బతికి ఉంటే.. మేము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాం అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ధ్వజమెత్తారు. విజయసాయి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే భయపడేవారు ఎవరూ లేరని బుద్దా దుయ్యబట్టారు. కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా. భారీ ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరూ తక్కువ ధరు తెగనమ్ముకోరు. కేవీ రావు దగ్గర కాకినాడ పోర్టును మీరు ఎలా తీసుకున్నారో చెప్పాలి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
ఎంతోమంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కులాన్ని అంటగడతావా. జగన్ తప్పు చేయలేదని, పోర్టును బలవంతంగా లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా. మీ తప్పులు, పాపాలను ఎత్తి చూపితే.. కులం పేరుతో కుట్రలు చేస్తారా. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో మాట్లాడతావా.. ప్రజలు చెప్పులతో కొడతారు. గతంలో కూడా ఎక్స్‌లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విజయసాయి ఉన్మాదానికి పరాకాష్ట. మీ ప్రభుత్వం వస్తే… లోపలేస్తాం అని అంటే.. చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారా. నీలాంటోడిని ఏ మాత్రం ఉపేక్షించకూడదు.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సీఎంగా ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలి. పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం.. చట్టపరంగా సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని కోరాం. అసలు విజయసాయిరెడ్డికి పరువు ఉందా.. పరువు నష్టం దావా వేయడానికి. నీకు దమ్ముంటే.. నాపై పరువు నష్టం దావా వేయి.. చూసుకుందాం. కాకినాడ పోర్టు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారు. జగన్, వైసీపీ నాయకులపై బాధితులే ముందుకు వచ్చి కేసులు పెడుతున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే సహించలేక.. నోరు పారేసుకుంటున్నారు.
గతంలో విశాఖలో మీడియా ప్రతినిధులను సైతం విజయసాయిరెడ్డి బూతులు తిట్టిన సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఏపీకి వస్తే మీడియా వాళ్లే కొడతారని విజయసాయిరెడ్డికి భయం. చంద్రబాబు పై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేదంటే న్యాయస్థానానికి వెళ్లయినా పోరాటం చేస్తాం. కుల ముద్ర వేయడం ఏమిటి, జైలుకు పంపడం ఏమిటి, చంపుతామని బెదిరించడం ఏమిట. ఇక నుంచి విజయసాయిరెడ్డి ఏది వాగినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసు కమిషనర్ కూడా నా ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు. న్యాయనిపుణలను సంప్రదించి, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.