- విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరదీపిక
- సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి శ్రీనివాసరావు
అమరావతి (చైతన్యరథం): పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రూపొందిన ‘మనబడి’ మాసపత్రికను బాపట్లలో శనివారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, బాపట్ల ఎంపీ టి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, బాపట్ల కలెక్టర్ వెంకట మురళి, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరదీపికలా ఉపయోగపడే మనబడి మాసపత్రికను రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు అన్నింటికి నెలనెలా పంపుతామని తెలిపారు. సామాజిక మాధ్యమాలు, వాట్సప్, యాప్, వెబ్‌సైట్ ద్వారా ‘మనబడి’ ఈ` కాపీ అందరికీ చేరుస్తామన్నారు. విద్యార్థులు వేసిన బొమ్మలు, రాసిన కథలు, కవితలు, పాటలు, వినూత్న ప్రయోగాలు, ఆటలు, సాధించిన విజయాలు-బహుమతులు, విద్యార్థుల విజయగాథలకు పత్రికలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తల వ్యాసాలు, ఆలోచనలతో మాస పత్రికను అందంగా, ఆకర్షణీయంగా తీసుకురావడం తమ లక్ష్యమని వివరించారు.
‘మనబడి’ గౌరవ సలహాదారులుగా ఉన్నతాధికారులు, ఎడిటర్‌గా తాను, వర్కింగ్ ఎడిటర్‌గా సీనియర్ జర్నలిస్ట్ చల్ల మధుసూదనరావు, పీఆర్వోగా గణేశ్ బెహరా, సలహా సభ్యులు, ఎడిటోరియల్ కమిటీ మాసపత్రిక ప్రచురణ బాధ్యతలు చూస్తుందని తెలిపారు.
రచనలు పంపాల్సిన చిరునామా:
ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ రచనలను ‘‘సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అండ్ ఎడిటర్, సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం, కేబీసీ బాయ్స్ హైస్కూల్ కాంపౌండ్,పటమట,విజయవాడ,ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్,పిన్:520010, వాట్సాప్ నంబర్: 8712652298 ఈ`మెయిల్: manabadimagazine@gmail.com కు పంపవచ్చన్నారు.