- హోం మంత్రి అనిత ధ్వజం
- వైసీపీ పాపాలు బయటపడుతుంటే ట్వీట్లు పెరుగుతున్నాయని ఎద్దేవా
- కాకినాడ పోర్ట్‌లో దందాలన్నీ వెలికితీస్తాం
- భూ అక్రమాలన్నింటిలో వైసీపీ నేతలే పాత్రధారులు
విశాఖపట్నం (చైతన్యరథం): వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శకుని లాంటి వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. ఆదివారం విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 2018లో అప్పటి హోం మంత్రి చినరాజప్ప భూమి పూజ చేసిన ఆరిలోవ పోలీస్ స్టేషను.. కూటమి ప్రభుత్వంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక దానిపై దృష్టి పెట్టాం. నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. బాడీ కెమెరాలు, నూతన ఫేస్ డిటెక్టివ్ సిస్టమ్స్ కొనుగోలు చేశాం. డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి ధ్వంసం చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలు పెట్టిందని అనిత పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో మళ్లీ ఎక్స్ వేదికగా చంద్రబాబును లోకేష్ ను టార్గెట్ చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పైన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి శకుని లాంటి వ్యక్తి అని ఆమె మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చంద్రబాబు మధ్య విభేదాలు రేకెత్తించేలా ట్వీట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాపాలు బయటపడుతుంటే ఆ పార్టీ నేతల ట్వీట్లు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థానంలోని వ్యక్తి పట్ల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వాములయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వైసీపీ నేతలు అందరినీ బెదిరింపులకు గురిచేశారు. కాకినాడ పోర్ట్ వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో వాస్తవాలు వెలికితీస్తామన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని.. వైసీపీ నేతల దందాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. ఎక్కడ భూ అక్రమాలు వెలుగు చూసినా, అందులో వైసీపీ నేతల పాత్ర ఉంటోంది. విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటకొచ్చాయి.