- హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- వేడుకల్లో ‘తారక రామం’ పుస్తకం విడుదల
- హైదరాబాద్లో 100 అడుగుల విగ్రహం, డిజిటల్ మ్యూజియం
- ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ విజయవాడలో ఈ నెల 14న జరగనుంది. దీనికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. ఎన్టీఆర్ స్మారక లిటరేచర్ కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్ధన్ ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 24 నాటికి ఎన్టీఆర్ తొలి సినిమా ‘మన దేశం’ విడుదలై 75 ఏళ్లు పూర్తయ్యాయని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకను నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘‘తెలుగు సినీ జగత్తులోనే కాకుండా భారతీయ సినీ రంగంలో ఎన్టీఆర్ ఒక మేరునగ ధీరుడు. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక… ఇలా ప్రతి పాత్రలోనూ ఆయన మేటి నటుడిగా నిలిచారు. ఒకే సినిమాలో నాయక, ప్రతినాయక పాత్రలు వేశారు. తనను ఎంతో ఆదరించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయ రంగంలోకి వచ్చిన ఆయన పేదవాడి మనసు తెలిసి వాళ్ల అవసరాలు తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. 40 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానం గురించి… రాయలసీమకు సాగు నీటి ప్రాజెక్టుల అవసరాల గురించి ఆలోచన చేశారని జనార్ధన్ వివరించారు.
వజ్రోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు పురందేశ్వరి, రామకృష్ణ, మోహనకృష్ణతోపాటు అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, రామానాయుడు కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్‌తోపాటు కలిసి పనిచేసిన కళాకారులు, టెక్నీషియన్లు, దర్శకులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 14న విజయవాడ శివారులోని పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని జనార్ధన్ వివరించారు. ఎన్టీఆర్ సినీ విశేషాలతో ఒక యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేస్తే రెండున్నర నెలల్లో దానిని 1.26 కోట్ల మంది చూశారని, 27 వేల మంది సబ్‌స్క్రయిబ్ చేశారని చెప్పారు. ‘మన దేశం’ నుంచి మొదలుకొని ఎన్టీఆర్ నటించిన మూడు వందల సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారంతో ‘తారక రామం’ పేరుతో ఒక పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకలో విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగునాట ఎన్టీఆర్ స్మృతి చిరస్థాయిగా ఉండటానికి హైదరాబాద్‌లో ఆయన 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ ఆయనకు సంబంధించిన విశేషాలతో డిజిటల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామని జనార్ధన్ తెలిపారు.