అమరావతి (చైతన్యరథం): కాకినాడ సెజ్ బాధితులైన పేద బీసీ రైతులు, మత్స్యకారులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. కాకినాడ సెజ్‌లో చిన్న రైతులు, మత్స్యకారుల నుంచి భూములు కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు లాభపడ్డాయని తెలిపారు. కేవీ రావు తక్కువ ధరకు సెజ్‌లో భూమిని కొనుగోలు చేసి జీఎంఆర్ సంస్థలకు రూ. వందల కోట్లకు విక్రయించారని, తరువాత వైసీపీ అధినేత జగన్ బినామీ అయిన అరబిందోకు దాదాపు రూ.4వేల కోట్లకు అమ్మారని ఆరోపించారు. కాకినాడ పోర్టు ద్వారా లబ్ది పొందిన వాటిల్లో దివీస్ కూడా ఒకటని యనమల రామకృష్ణుడు వెల్లడిరచారు. భూమిని కోల్పోవడంతోపాటు, సముద్ర, వాయు కాలుష్యం వల్ల పేదలైన బీసీ వర్గాలు ఈ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయాయని యనమల తెలిపారు. సెజ్ కోసం దాదాపు 10వేల ఎకరాలు కోల్పోయిన వారి సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
కోన ఆటవీవాసులకు అనుకూలంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించకుంటే, వారు సమస్యల కోసం నిరంతరం పోరాడాల్సి వస్తుందన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చెన్నైలోని ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులకు లేఖలు రాశానని యనమల వెల్లడిరచారు. పేదల నుంచి తక్కువ ధరకు బలవంతంగా భూములు కొనుగోలు చేసింది వైసీపీ నేతలేనని ఆరోపించారు. రైతుల్ని మోసం చేసిన వారిలో వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వం ఆ భూములను అసలైన రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కబ్జా భూములు కావడంతో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చునని తెలిపారు.