- విద్యారంగానికి ఏడాదికి రూ.14 వేల కోట్లు ఖర్చు
- పేరెంట్`టీచర్ సమావేశంలో మంత్రి నాదెండ్ల
పార్వతీపురం (చైతన్యరథం): విద్యారంగానికి ప్రభుత్వం ఏటా రూ.14 వేల కోట్లు వెచ్చిస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం పార్వతీపురం మండలం నర్సీపురంలో జరిగిన మెగా పేరెంట్స్`టీచర్స్ డే సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం పునరంకితం కావాలని పిలుపు ఇచ్చారు. పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందన్నారు. పిల్లలను చదువు వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. దేశానికి ఉపయోగపడే పౌరులను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. భావి పౌరుల కోసం ప్రభుత్వం తాగునీరు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంతో పాటు మరెన్నో అందజేస్తోందని తెలిపారు. గత ఐదేళ్లలో భారత ప్రభుత్వం ప్రతి ఏటా రూ.4 వేల కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ, పాఠశాలల్లో మౌలిక వసతులు కనిపించడం లేదన్నారు.
రాబోయే 30 ఏళ్ల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ డాక్యుమెంట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి ప్రాంతంలో పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. తల్లిదండ్రులు.. పిల్లలను క్రీడలు, పర్యావరణాభివృద్ధికి అనుమతించాలని, డ్రగ్స్‌కు అలవాటు పడకుంగా చూడాలని మంత్రి కోరారు. పంచాయతీల పని వ్యవస్థ, పౌరుని బాధ్యతలను పెంపొందించడానికి పాఠశాలల్లో ‘‘బాల పంచాయితీ’’ భావనను అనుసరించాలని ఆయన సూచించారు. పిల్లలు ‘‘తిరిగి ఇవ్వడం విధానం’’ గురించి ఆలోచించాలని ఆయన ఉద్బోధించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ టీచర్లు, తల్లిదండ్రుల సమావేశం అనే మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1590 పాఠశాలలు ఉన్నాయని, 95 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. జిల్లాలో మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమాన్ని చేపట్టి పిల్లలకు సలహాలు ఇస్తూ, మార్గనిర్దేశం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోబిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, సబ్ డివిజనల్ పోలీసు అధికారి అంకితా సురానా, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
పొలంలో ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పొలాల్లో ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శనివారం జిల్లాలో పర్యటించిన మంత్రి పార్వతీపురం మండలం పెదబొండపల్లి పొలాల్లో వరి ధాన్యాన్ని పరిశీలించి, గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు పరికరాలను పరిశీలించారు. రైతులతో ముఖముఖి మాట్లాడుతూ మంచి దిగుబడి, ఆదాయాన్ని పొందడానికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త సంస్కరణలతో ముందుకు రావాలని సూచించారు. వరి కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలుసని, ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ రైతులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తోందన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంచి అవగాహన ఉందన్నారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ప్రభుత్వంపై రైతులు నమ్మకం ఉంచాలని కోరారు.
మంత్రి అడిగిన ప్రశ్నలకు రైతులు సమాధానమిస్తూ వరి కొనుగోలు విధానంపై హర్షం వ్యక్తం చేస్తూ 24 గంటల్లో డబ్బులు అందుతున్నాయన్నారు. గత సంవత్సరం వరకు, మేము డబ్బుల కోసం సంవత్సరం వరకు ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. జంరaావతి ప్రాజెక్టును పూర్తి చేస్తే తమకు సాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తీరతాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర, జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోబిక, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, అధికారులు, అధికారులు పాల్గొన్నారు.