- రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేరెంట్`టీచర్ సమావేశాలు
- బాపట్ల మున్సిపల్ హై స్కూల్ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
- ఆయా పాఠశాలల్లో హాజరుకానున్న ప్రజాప్రతినిధులు
- విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
అమరావతి (చైతన్యరథం): పిల్లల బంగారు భవిష్యత్తు, నాణ్యమైన చదువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శనివారం మెగా పేరెంట్`టీచర్ సమావేశాలు (పీటీఎం) నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే సారి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించేందుకు, ప్రైవేటు పాఠశాలల కంటే ఉత్తమంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు నిర్వహిస్తున్న ఈ సమావేశాల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. బాపట్ల మున్సిపల్ హై స్కూల్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరవుతారు.
ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, తదితర ప్రజాప్రతినిధులు వారికి దగ్గరలో ఉన్న పాఠశాలలో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే చిన్న రాష్ట్రమైన ఢల్లీిలో నిర్వహించారు. పెద్ద రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పీటీఎంలు నిర్వహిస్తారు.
సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు పాటించాల్సిన కొన్ని సూచనలు
1. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని స్థాయిలలో ఉన్న నాయకులు రాజకీయాలకు అతీతంగా విధిగా పాల్గొనాలి.
2. సమావేశంలో విద్యారంగం గురించి మాత్రమే ప్రసంగించాలి.
3. స్వీయ క్రమశిక్షణ పాటించడం ద్వారా తమ నాయకత్వ లక్షణాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకునేలా నేతలు మార్గదర్శనం వహించాలి.
4. ప్రజాప్రతినిధులందరూ ఒకే పాఠశాలలో కాకుండా, వారివారి గ్రామాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే పాల్గొనడం వల్ల అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతమై లక్ష్యం నెరవేరుతుంది.
5. పిల్లల చదువు మెరుగుపడటానికి, పాఠశాల అభివృద్ధికి సూచనలు, సలహాలు, సహకారం తెలియజేసేలా ప్రసంగాలు ఉండాలి.
6. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లితండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలపడం సందర్భోచితం.
7. రాజకీయ పార్టీలు, వివిధ భావజాలాలకు సంబంధించిన కండువాలు, దుస్తులు, టోపీలు ధరించి సమావేశానికి హాజరు కారాదు.
8. మంత్రి వస్తున్నారని, ఎమ్మెల్యే వస్తున్నారని అంతా ఒకే పాఠశాల సమావేశానికి వెళ్లరాదు. ప్రజా ప్రతినిధులు తమ ఊరి పాఠశాలలో జరిగే సమావేశానికి హాజరై విజయవంతం చేయాలి.
9. రాజకీయపార్టీల ఫ్లెక్సీలు, బేనర్లు, వ్యక్తుల ఫోటోలు సమావేశం వద్ద కానీ, స్వాగతాలుగా కానీ ప్రదర్శించరాదు.
10. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు కాకుండా ఇతరులకు సమావేశాలకు అనుమతి లేదు.