- పోలవరం పనుల్లో గంట కూడా వృధా కాకూడదు
- రెండోవారంలో పోలవరం ప్రాజెక్ట్ షెడ్యూల్ విడుదల
- వాటర్ పాలసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
- సమావేశ వివరాలు వెల్లడిరచిన జలవనరుల మంత్రి నిమ్మల
- వాళ్లేవుంటే.. వెలిగొండపై ఆశలు వదిలేసేవాళ్లం..
- జగన్, అంబటిపై మంత్రి నిమ్మల సెటైర్లు
- ప్రతి బిందువును ఒడిసి పట్టేలా వాటర్ పాలసీ: నిమ్మల
అమరావతి (చైతన్య రథం): పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఒక్క గంట, ఒక్కరోజు కూడా వృధాకాకుండా షెడ్యూల్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిరచారు. మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం ప్రాజెక్ట్, హంద్రీ-నీవా ప్రాజెక్టులతోపాటు, వాటర్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారన్నారు. డిసెంబర్ రెండోవారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడే ప్రాజెక్టు పనులకు సంబంధించిన భవిష్యత్ షెడ్యూల్‌ను సీఎం విడుదల చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పునఃప్రారంభంపై గత ఐదు నెలలుగా కసరత్తు చేస్తోన్న ఇరిగేషన్ శాఖ, సాంకేతిక అడ్డంకులను అధిగమించి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. గత నెలలో మూడు రోజులపాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, సిడబ్ల్యూసి, పిపిఎ, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించామన్నారు. ఈ మూడు రోజుల వర్క్‌షాప్‌లో డయాఫ్రం వాల్, ఈసిఆర్‌ఎఫ్ డిజైన్లు, నిర్మాణంపై చర్చ జరిగిందని, ఇప్పటికే డిజైన్లకు సంబంధించి సూత్రప్రాయంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అంగీకారం తెలిపిందని వివరించారు. జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు, తరువాత ఈసిఆర్‌ఎఫ్ డ్యాం పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారన్నారు. రెండు ప్రధాన నిర్మాణాలు సమాంతరంగా చేపట్టేందుకు ఇప్పటికే సాంకేతిక అనుమతి లభించిందని మంత్రి వివరించారు. ఈ నెలలోనే ఈసిఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో గ్రౌండ్ ఇంప్రూవ్‌మెంట్ పనులు పూర్తవుతాయని వివరించారు.
ఇక ప్రాజెక్టులో కీలకమైన పునరావాస పనుల్లో జీవో నెంబర్ 35ను అమలు చేసి త్వరితగతిన కాలనీల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. పునరావాసంలో పెండిరగ్ పనులు, ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు సంబంధించి పెండిరగ్‌లోవున్న రూ.996 కోట్లు వెంటనే విడుదలకు సీఎం అంగీకరించారన్నారు. ప్రాజెక్టుకున్న అంతర్రాష్ట్ర సమస్యలను, ఒరిస్సా మరియు చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతో చర్చించి సమస్యను పరిష్కరించి, ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయమని సీఎం సూచించినమట్టు మంత్రి నిమ్మల చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలను, ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమకు తీసుకెళ్తామని వివరించారు నిమ్మల.
డిసెంబర్ నుంచే హంద్రీనీవా..
రాయలసీమకు సాగు, తాగు నీరందించే హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను డిసెంబర్‌లో తిరిగి ప్రారంభించేలా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రధాన కాల్వ పూర్తి సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెంచేందుకు వీలుగా లైనింగ్ పనులతో పాటు, విస్తరణ పనులు చేపడతామని వివరించారు.
వైసీపీ హాయంలో చింతలపూడి విధ్వంసం
రెండు ఉమ్మడి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా పర్యావరణ అనుమతుల విషయంలో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మూడు నెలల్లో ఈసీ తీసుకోమని 2022లో సుప్రీం కోర్టు చెప్పినా, గత ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైందన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరందించే ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుళ ప్రయోజనకారి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించేందుకు అడ్డంకిగావున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి, పనులు ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మంత్రి నమ్మల తెలిపారు.
వాళ్లేవుంటే వెలిగొండ ఎప్పటికయ్యేదో?
అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పనులు కూడా ఈనెలనుంచే ప్రారంభించి 2026 జూన్‌నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. చంద్రబాబులాంటి కష్టపడే వ్యక్తి ఉంటేనే వెలిగొండ పూర్తవ్వడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని తెలిపారు. అదే జగన్‌గానీ, అంబటి రాంబాబుగానీ ఉండివుంటే వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అనేవాళ్ళని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.
ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టేలా వాటర్ పాలసీ:
ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రాంగా మార్చేందుకు సీఎం సూచనలమేరకు వాటర్ పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. దీని ద్వారా ప్రతి నీటి బొట్టూ ఒడిసిపట్టి, ప్రతి ఎకరాకూ నీళ్లివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఏడాదికి రెయిన్ ఫాల్, రివర్ ఇన్ ఫ్లో ద్వారా మొత్తం 11 వేల టీఎంసి వచ్చాయని పేర్కొన్నారు. ఇరిగేషన్, డ్రిరకింగ్ వాటర్, ఇండస్ట్రీస్‌కి కలిపి 954 టిఎంసి వాడకం జరుగుతోందన్నారు. మనకు వివిధ రూపాల్లో అందుబాటులోకి వస్తున్న నీటి వనరుల్లో కనీసం 10శాతం కూడా మనం ఉపయోగించుకోవడంలేదని అన్నారు. ఈ పరిస్దితిని అధిగమించి సమగ్ర ప్రణాళికతో నీటి వనరుల సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో వాటర్ పాలసీ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం అనేది గేమ్ ఛేంజర్ కాబోతుందని మంత్రి అన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై సమగ్ర కసరత్తు చేస్తోందని వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని బనకచర్లకు తీసుకెవళ్ళడం ద్వారా రాయలసీమ అవసరాలను పూర్తిగా తీర్చవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.