- పథకాన్ని సమర్థంగా అమలు చేస్తాం..
- కేంద్రంనుంచి పూర్తి సహకారం కావాలి
- ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ
ఢిల్లీ (చైతన్య రథం): జల జీవన్ మిషన్ పథకాన్ని ఏపీలో పునరుజ్జీవింప చేస్తామని, అందుకు కేంద్ర సహకారం అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢల్లీి పర్యటనలోవున్న డిప్యూటీ సీఎం, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో పవన్ మాట్లాడుతూ ‘దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఏపీలో గత ప్రభుత్వం గాలికొదిలేసింది. కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ఎన్డీయే సర్కారు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధంగా ఉంది’ అని ప్రధాని మోదీకి వివరించారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో రాష్ట్ర విజన్‌ను ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ వివరించారు.
ఏపీలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం రూ.23 వేల కోట్లు కేటాయిస్తే, గత ప్రభుత్వం కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. గత ప్రభుత్వానికి శ్రద్ధ కొరవడటంతో పూర్తైన పనులు ఏమాత్రం ప్రయోజనకరం కాకుండా పోయాయని, నాసిరకం పనుల కారణంగా నిధులు దుర్వినియోగమయ్యాయని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో చేసిన పథకం పనులను తగినవిధంగా ఉపయోగించుకొని, జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్టుగా కొత్తగా పనుల్ని మొదలెట్టేందుకు సంపూర్ణ డీపీఆర్‌ను తయారు చేసిందని వివరించారు. పథకం ద్వారా గ్రామీణులందరికీ 24 గంటలు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించామన్నారు. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని ప్రధాని మోదీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆశయం’గా పవన్ వివరించారు.