ఢిల్లీ: బోరు బావులపై ఆధారపడకుండా.. దీర్ఘకాలిక, శాశ్వత వనరుల నుంచి నీటిని సేకరించడం ద్వారా జల జీవన్ మిషన్ (జేజేఎం) నిజమైన స్ఫూర్తిని సాధించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్. శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో మంగళవారం పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జేజేఎం అమలుపై చర్చించారు. 2019-2024 మధ్య అందించిన కనెక్షన్లలో కుళాయిల సామర్థం, నీటి నాణ్యత అంశంలో ఇటీవల చేసిన సర్వే ద్వారా పలు సమస్యలను గుర్తించామని కేంద్ర మంత్రికి తెలిపారు. సర్వే ఫలితాల ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్లు అందలేదు. అలాగే 2.27 లక్షల పంపులు పని చేయడం లేదు. మరో 24 వేల ట్యాపులు అవసరమైన స్థాయిలో నీటిని సరపరాచేయడం లేదని పవన్ వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తగినంత మేర నీటి సరఫరా (ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్లు), నాణ్యమైన నీటిని అందించాలన్న లక్ష్యాలను ఇంకా సాధించలేదని సర్వే ద్వారా తేలిందని చెప్పారు.
కూటమి ప్రభుత్వం జేజేఎం స్ఫూర్తిని, లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరమని కేంద్రమంత్రి పాటిల్‌ని ఉప ముఖ్యమంత్రి పవన్ కోరారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ గృహాలకు సురక్షితమైన తాగునీటిని సజావుగా అందించేందుకు అవసరమైన నిధులను సమకూర్చడంలో కేంద్రం సానుకూలంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జేజేఎం పథకం లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించగలమని వపన్ వివరించారు.