- రెండోసారీ విచారణకు గైర్హాజర్
- హైదరాబాద్ చేరుకున్న ఒంగోలు పోలీసులు
హైదరాబాద్ (చైతన్యరథం): వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్టు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవీ సోమవారం ఒంగోలు రూరల్ పీఎస్‌లో విచారణకు వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల వేదికగా రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆర్జీవీ ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనకు 4 రోజుల సమయం కావాలంటూ రాంగోపాల్ వర్మ అదేరోజు వాట్సాప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. అనంతరం 25న ఉదయం విచారణకు హాజరుకావాలంటూ మరోసారి ఆర్జీవీకి పోలీసులు నోటీసులు పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు.
ఆర్జీవీ హైదరాబాద్‌లో లేరని.. సినిమా షూటింగ్‌ల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఇంటివద్ద ఉన్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. మరోవైపు ఆయన తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ విచారణకు సహకరిస్తామని.. కొద్దిరోజుల సమయం కావాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. సినిమా పనుల్లో భాగంగా రాంగోపాల్ వర్మ వేరే ప్రాంతంలో ఉండటంతో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరినట్లు చెప్పారు. రెండోసారి కూడా విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు, ముంబయికి రెండు బృందాలు వెళ్లాయి. అయితే ఆర్జీవీ సోషల్ మీడియా ఖాతాల హ్యాండిల్స్ లోకేషన్ హైదరాబాద్ పరిధిలోనే చూపిస్తున్నాయి. నగర శివార్లలో సన్నిహితులకు చెందిన ఫాంహౌస్‌ల్లో ఆర్జీవీ ఉండొచ్చని అనుమానిస్తున్నారు.