- రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మంత్రి భరత్ భరోసా
- గాయపడ్డవారికి చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ
అనంతపురం (చైతన్యరథం): అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఇటీవల బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి టీజీ భరత్ భరోసా ఇచ్చారు. ఆదివారం అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి భరత్ పరామర్శించారు. ఆందోళన వద్దని ధైర్యం చెప్పారు. వారికి అందుతున్న వైద్యసేవలపై వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అనంతరం ప్రమాదంతో మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ పి.జగదీష్, తదితరులు పాల్గొన్నారు.