- కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరానికి చెప్పాలి
- విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి
- ప్రభుత్వ సలహాదారు చాగంటికి సీఎం చంద్రబాబు సూచన
- తన బాధ్యత నెరవేర్చేందుకు కృషి చేస్తానన్న చాగంటి
- సచివాలయంలో చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్‌తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనను సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చన్నారు.
ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతమని… వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. సుమతీ- వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరావును సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.