- నిందితుడినే ఆలయ ట్రస్టీగా నియమించారు
- న్యాయ విచారణ జరిపించి తొలగించాలి
- నరసరావుపేటకు చెందిన వ్యక్తి ఫిర్యాదు
- భూ అక్రమాలపై పలువురు బాధితుల మొర
- గత ప్రభుత్వం ఫీజు చెల్లించలేదని విద్యార్థిని గోడు
- పోలీసుల వల్లే కొడుకు చనిపోయాడని తల్లి ఆవేదన
- ప్రజా వినతుల కార్యక్రమానికి తరలివచ్చిన అర్జీదారులు
మంగళగిరి(చైతన్యరథం): ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్ పీతల సుజాత, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిష్వం త్‌లు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.
` నరసరావుపేట పట్టణం స్టేషన్ రోడ్డులో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి గుడిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండదండలతో ధ్వజస్తంభం, దానికి సంబంధించిన ఇత్తడి సామగ్రిని దొంగిలించి అమ్ముకున్న వ్యక్తులపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని పట్టణా నికి చెందిన సూలం రమేష్ ఫిర్యాదు చేశారు. సామగ్రి కొట్టేసిన అక్రమార్కుడిని ఆలయ ట్రస్టీగా నియమించారని అతడిని తొలగించాలని కోరారు.
` జగన్ ప్రభుత్వంలో రీ సర్వే జరిగినప్పుడు అధికారులకు లంచం ఇచ్చి దొంగ పాస్ పుస్తకాలు చేయించుకుని తమ వారసత్వ భూమిని కె.నాగేష్ నాయక్ ఆనే వ్యక్తి అతని పేరుపై ఆన్‌లైన్ చేయించుకున్నాడని నంద్యాల జిల్లా పాములపాడు మండలం భానుముక్కల గ్రామానికి చెందిన చిన్న నాగన్న ఫిర్యాదు చేశాడు. ఆ భూమి వంద సంవత్సరాల నుంచి తమ ఆధీనంలో ఉందని..అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
` టీడీపీలో తిరుగుతున్నానని తనపై వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టారని … వాటిని తొలగించేలా చూసి తనకు ఉపాధి కల్పించాలని నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన రాంగోపాల్‌రెడ్డి వినతిపత్రం అందజేశాడు.
` డబ్బులు తీసుకుని అక్రమంగా రికార్డులు మార్చిన వీఆర్వోపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు దక్కేలా చూడాలని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లవ రం గ్రామానికి చెందిన యొన్ముల చిట్టెమ్మ వేడుకుంది.
` హాసిని అనే అమ్మాయి కనిపించకపోవడంతో తన కొడుకు(19)ను స్టేషన్‌కు తీసుకెళ్లి దారుణంగా కొట్టడంతో చనిపోయాడని విశాఖపట్నం తిక్కవానిపాలెంకు చెందిన యశోద కన్నీటిపర్యంతమైంది. తన కొడుకు చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వేడుకుంది.
` దాసరి రామయ్య అనే వ్యక్తి పంచాయతీ రోడ్డుకు కర్రలను అడ్డంగా కట్టి ప్రజల ను రోడ్డుపై తిరగనివ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నాడని…ఆయనపై చర్యలు తీసుకుని కర్రలను తొలగించాలని కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం దళితవాడకు చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు.
` తాను భీమవరంలోని బీవీ కాలేజ్‌లో ఎంసీఏ పూర్తి చేశా… గత ప్రభుత్వం తనకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకపోవడంతో తన సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఇజ్జపురెడ్డి తేజో సౌందర్యవాణి ఫిర్యాదు చేసింది. దయచేసి తన సర్టిఫికెట్లు ఇప్పించాలని వేడుకుంది.
` గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద పశువులకు మినీ గోకులం పథకంలో భాగంగా తాను రేకుల షెడ్ నిర్మించుకుంటే ఇంతవరకు ఎటువంటి బిల్లు రాలేదని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలానికి చెందిన చిన్న వెంకటరెడ్డి తెలిపారు. తనకు బిల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే తమ చెరువులో చిల్ల చెట్లు పెరగడం వల్ల పందులు వచ్చి సమీప పంట పొలాలను నాశనం చేస్తున్నాయని.. చెరువులోని చిల్లచెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు.