- రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి
- వారసత్వ ప్రాంతాలను సంరక్షించేలా చర్యలు చేపట్టాలి
- ఆలయాల పవిత్రతను కాపాడేలా సదస్సులు నిర్వహించాలి
- అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచనలు
- టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజంపై సమీక్ష
- పాల్గొన్న దేవాదాయ, పర్యాటక మంత్రులు ఆనం, కందుల
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. సోమవా రం మంగళగిరి క్యాంపు కార్యాలయలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్ అండ్‌బీ, ఐఅండ్‌ఐ శాఖల మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశా లు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని, రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.
ఆలయాలు, పర్యావరణం, సాహస క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళతామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడిరచారు. గతంలో పాలకులు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు తీసుకువెళ్లేవారు. పి.వి.నరసింహారావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో యాత్ర బస్సుల పేరిట దివ్య క్షేత్ర దర్శనం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టూరిజం అంటే విదేశాలకు వెళ్లడం అనే పరిస్థితి ఉత్పన్నమైంది. గతంలో ఎకో టూరిజం గురించి మాట్లాడాం. దాని కి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు కూడా ప్రారంభించామని వివరించారు.
మన వారసత్వ సంపదకు ప్రాచుర్యం కల్పించాలి
పర్యాటక అభివృద్ధికి మనకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని, దొండపాడు, ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లాంటి ప్రాంతాల్లో విద్యార్థుల కోసం అడ్వెంచర్ థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మన రాష్ట్ర విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లాలంటే పాఠశాల యాజమాన్యాలు పక్క రాష్ట్రాలైనా కర్ణాటక, కేరళ ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. అక్కడ విద్యార్థుల కోసం అడ్వెంచర్ థీమ్ పార్కులు ఏర్పాటు చేశారు. అలాంటి వాటిని మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వాటిపై దృష్టి పెట్టడం వల్ల చాలామంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు వినోదం, ఉత్సాహంతో పాటు గొప్ప అనుభూతిని అందించవచ్చు. నంద్యాలలో ఏనుగుల క్యాంపులు ఉన్నాయి. గండికోట, హార్స్‌లీ హిల్స్‌ల్లో అద్భుతమైన కొండలు ఉన్నాయి. మన వారసత్వ సంపదకు తగిన ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
తిరుపతి దగ్గర గుడిమల్లం ఆలయం, కాకినాడ సమీపంలో ఉన్న కోరింగ మడ అడవులు, వన్యప్రాణి అభయారణ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కడ ఏమున్నాయి అన్న సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు. రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధి చెందాలి అంటే అసలు రాష్ట్రంలో ఎక్కడ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయనే విషయం ప్రజలకు తెలియాలి. అలా తెలియాలంటే ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేయాలి. న్యూజిలాండ్, ఉక్రెయిన్ లాంటి దేశాలు చలనచిత్ర మాధ్యమాన్ని అందుకు ఎంచుకుంటున్నాయి. సినిమాల ద్వారా పర్యాటక ప్రాంతాలకు తేలికగా ప్రచారం కల్పించవచ్చు. ఒక సినిమాలో ఒక స్పాట్‌ను ప్రమోట్ చేస్తే అదే కరపత్రంగా మారుతుంది. స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించడం ద్వారా అది సాధ్యపడుతుంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా లాతూర్ ప్రాంతం నుంచి తిరుపతి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైలు కావా లని అడిగారు. ఆ ప్రాంతం నుంచి నిత్యం 1000 మంది వరకు శ్రీవారి దర్శనానికి వస్తారు.
వారి కోసం రైల్వే శాఖ సమన్వయంతో యాత్ర బస్సుల మాదిరి సీజన్ల వారీగా ప్రత్యేక రైళ్లు వేయించాలి. తద్వారా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించవచ్చు. కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లిన సందర్భంగా ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీశైలంకు కాలినడకన వచ్చే భక్తుల ప్రస్తావన తెచ్చారు. వారికి గతంలో సౌకర్యాలు ఉండేవి. ప్రస్తు తం వాటిని తీసేశారు. ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా అటవీశాఖ అధికారులు మా దృష్టికి తీసుకువచ్చిన టూరిజం పోలీసింగ్ అంశం కూడా చర్చకు వచ్చింది.
దేవాలయాల పవిత్రత కాపాడటం అందరి బాధ్యత
మహారాష్ట్రలో పాండురంగ యాత్రను అక్కడ ప్రజలు చాలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తా రు. క్రీస్తు పుట్టిన జెరూసలేం వెళ్లినా… వాటికన్ సిటీని సందర్శించినా చాలా క్రమశిక్షణ తో ఎక్కడా అరుపులు, కేకలు లేకుండా భక్తిభావంతో ప్రజలు మెలుగుతారు. మన దగ్గర దేవాలయాలు అంటే పిక్నిక్ స్పాట్స్‌లా మారిపోయాయి. ఆలయాల పవిత్రతను కాపాడే లా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా మన సంస్కృతి, విశిష్టతను అందరికీ తెలియచేయాలి. పల్లెల అభివృద్ధికి గ్రామసభలు నిర్వహించినట్లు ఆలయాల పవిత్రతను కాపాడటానికి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం వంటివి చేయాలి.
ఆల య ప్రాంగణాల్లో తిరిగేటప్పుడు ఎలా క్రమశిక్షణతో మెలగాలి, డ్రెస్ కోడ్ వంటి వాటిపై అవగాహన కల్పించాలి. వీటితో పాటు దేశం గర్వించదగ్గ నాయకుల ఇళ్లు, వారు నడ యాడిన ప్రాంతాలు, ఫ్రీడమ్, సోషల్ మూమెంట్స్‌కు సంబంధించిన ప్రాంతాలను గుర్తించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. హెరిటేజ్ ప్రాంతాలను గత పాలకులు తమ స్వార్థానికి తవ్వుకుంటూ వెళ్లిపోయారు. అటువంటి వాటిని గుర్తించి కాపాడుకోవడం చాలా అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా పర్యాటకుల భద్రత చాలా అవసరమని సూచించారు.