- భేటీల్లో చర్చించిన రహస్యాలేమిటి
- రూ.1750 కోట్లు లంచంపై జగన్ స్పందించాలి
- నిజాయితీపరుడైతే మీడియా ముందుకొచ్చి మాట్లాడాలి
- టీడీపీ నేత అనం వెంకట రమణారెడ్డి డిమాండ్
నెల్లూరు (చైతన్యరథం): అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆదివారం మీడియాతో రమణారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో నమోదైన కేసు విచారణకు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపి జగన్ నిజాయతీ నిరూపించుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీని మూడు సార్లు కలసిన జగన్ రెడ్డి.. ఆ భేటీల్లో ఏం రహస్యాలు మాట్లాడుకున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబు కూడా పారిశ్రామిక వేత్త్తలను కలుస్తుంటారు. అయితే కలసిన ప్రతిసారీ చర్చల వివరాలను అధికారికంగా మీడియాకు తెలియజేస్తారు. పారిశ్రామికవేత్తలతో భేటీల సమయంలో సీఎం చంద్రబాబుతో అధికారులు కూడా ఉంటారు. జగన్ మాత్రం తానొక్కరే అదానీతో చర్చలు జరపటంలో ఆంతర్యమేమిటి. అదానీతో మూడో సమావేశం తరువాత సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లు రేసు గుర్రం కంటే వేగంగా కదలటం వెనుక ఉన్న మతలబేమిటి. అదానీతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేల కోట్ల రూపాయల భారం మోపారు. ఓడిపోయిన తరువాత ప్రెస్ మీట్లు పెడుతున్న జగన్.. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టలేదని రమణారెడ్డి నిలదీశారు.
తప్పు చేయకుంటే స్పందించాలి
సెకితో కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రహస్యం బయట పెట్టాలి. జగన్మోహన్ రెడ్ది తప్పు చేయకపోతే అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ చేసిన ఆరోపణలపై వెంటనే స్పందించాలి. జగన్మోహన్ రెడ్ది రూ.1750 కోట్లు లంచం తీసుకున్నాడని అమెరికా దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసాయి. ఈ ఒప్పందంలో జగన్ అవినీతిపై టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ గతంలోనే కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్‌కి ఫిర్యాదు చేసి, హై కోర్టులో కేసు కూడా వేశారు. ఇంత వరకు భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రులపై ఇతర దేశంలో కేసులు నమోదయిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్ది వల్ల దేశ పరువు పోతోంది. సోలార్ పవర్ ఇతర రాష్ట్రాల్లో గతంలో యూనిట్ 11, 14 రూపాయలకు కూడా కొన్నారు.. చంద్రబాబు 4 రూపాయలకు కొన్నారని సాక్షి పత్రికలో రాశారు. పత్రికల్లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారించుకోవాలి. టెక్నాలజీ అభివృద్ధి అయ్యేకొద్దీ ధరలు తగ్గుతాయనే విషయం కూడా తెలియదా అని రమణారెడ్డి ప్రశ్నించారు.
దేవుడే శిక్షించాడు
గ్రీన్ కో, అరవిందో, షిరిడీ సాయి లాంటి కంపెనీలతోనూ జగన్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వాటిల్లో ఎంత లంచం తీసుకున్నాడో విచారణ జరగాలి. మాకున్న సమాచారం రూ.30 వేల కోట్ల మేర లంచాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్ది అవినీతితో పోలవరం లాంటి ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి. జగన్ రెడ్డి తిరుమల వేంకటేశ్వర స్వామికి ద్రోహం చేశాడని, అందుకే ఇక్కడయితే తప్పించుకుంటాడని ఏడుకొండల వాడు అమెరికాలో ఇరికించాడు. ఇక్కడ మాదిరిగా ఉండదు. అమెరికాలో విచారణ వేగంగా జరుగుతుంది. అపారమైన న్యాయపరిజ్ఞానం కలిగిన అప్పటి ఈఆర్‌సీ చైర్మన్ సీవీ నాగార్జున రెడ్ది.. రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారంపడే ఒప్పందాన్ని ఎలా అంగీకరించారో చెప్పాలి. ఆయన బయటకు వచ్చి నిజం చెప్పాలి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ త్వరగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి అమెరికా జైల్లో పెట్టి ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయాలి. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో మాత్రమే కాదు మిగిలిన వాటిల్లో ఎంత అవినీతి ఉందో విచారణ జరిపించాలి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తప్పు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్‌ను దేవుడే శిక్షించాడు. అవినీతి అభియోగాలు తేలేవరకు జగన్‌కు వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగే హక్కుగానీ, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొనసాగే హక్కు గానీ లేదు. జగన్‌పై ఇండియాలో ఉన్న కేసుల విచారణలో న్యాయస్థానాలు వేగం పెంచాలని రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు.