- కడప స్టీల్‌ప్లాంట్ ఎందుకు ఆలస్యమవుతోంది
- విభజన చట్టం మేరకు రావాల్సిన సంస్థలు, నిధుల మాటేమిటి
- సోషల్ మీడియా సైకోల కట్టడికి కఠిన చట్టాలు
- పార్లమెంట్‌లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరాం
- మీడియాతో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు
ఢల్లీి: ఏపీకి సంబంధించిన పలు అంశాలపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఢల్లీిలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో లావు పాల్గొన్నారు. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది. ఆంధ్రప్రదేశ్ తరపున పార్లమెంట్లో లేవనేత్తే అభివృద్ధి, సంక్షేమ అంశాలపై ఈ సమావేశంలో ఎంపీ లావు చర్చించారు.
అనంతరం మీడియాతో లావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి వచ్చాయి.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంపై సభలో చర్చించాలని కోరాం. ఆయిల్ రిఫైనరీ, కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన పెండిరగ్ సంస్థలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని కోరాం. విభజన హామీల మేరకు రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల అభివృద్ధిపై చర్చించాలని కోరాం. ఇటీవల విజయవాడకు వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరాల్లో వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, దానికి సంబంధించిన నిధుల వినియోగంపై చర్చించాలి. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై అడుగులు ముందుకు పడలేదు. ఇది పూర్తిచేస్తే సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందుకే నదుల అనుసంధానంపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం.
ఏపీలో జరిగే నదుల అనుసంధానం దేశానికే ఆదర్శం, స్పూర్తిదాయకం కావాలని చెప్పాం. ఆచార్య రంగా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరాం. అలాగే, వలస కార్మికుల కష్టాలు, సమస్యలను కూడా సమగ్రంగా చర్చించాలని, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని.. దీనికోసం కఠిన చట్టం తేవాలని సూచించాం. ‘వక్ఫ్’ చట్టంపై చర్చ పూర్తి కాలేదు. ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని లావు తెలిపారు. ముస్లింల అభీష్టం మేరకు, బిల్లు రూపకల్పన జరగాలని కోరాం. ముస్లిం మైనారిటీల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే సూచించామని తెలిపారు.
విదేశాలకు వలస వెళ్లే ఎంతోమంది అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వారికోసం చట్టం తీసుకురావాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ లావు తెలిపారు. అదానీ వ్యవహారంలో ఏపీ ప్రస్తావన రావడం దురదృష్టకరమని లావు అన్నారు. ఏపికి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇలాంటి సంఘటనలకు కారకులైన వారిని సమర్థించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.