అమరావతి (చైతన్య రథం): స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఎమ్మెన్సీ మద్యం కంపెనీలను రాష్ట్రంనుంచి తరిమేసిందన్నారు. అసెంబ్లీలో నూతన మద్యం విధానంపై చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. వైకాపా విధానాలపై విమర్శలు గుప్పించారు ‘‘నాసిరకం మద్యం తాగి అనేకమంది అనారోగ్యం పాలయ్యారు. నాసిరకం మద్యంతో కిడ్నీ, కాలేయం సంబంధిత జబ్బులు పెరిగాయి. మద్యం తయారు చేసే 26 కొత్త కంపెనీలు తీసుకొచ్చారు. మద్యం విషయంలో వైకాపా పాలకులు వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడ్డారు. ఆన్‌లైన్ పేమెంట్స్ లేకుండా వ్యవస్థను నాశనం చేశారు. పరిపాలన చేతకాక ఆఖరికి బాండ్లు కూడా తాకట్టు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చాం. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మద్యం పాలసీ తెచ్చాం. మేంవచ్చాక మద్యం విషయంలో పారదర్శకంగా పని చేశాం. దుకాణాల దరఖాస్తు ఫీజు కిందే రూ.1,800 కోట్లు వచ్చింది. 12 ప్రీమియం మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని సబ్‌కమిటీ సిఫార్సు చేసింది. రూ.99కే నాణ్యమైన మద్యం ఇస్తున్నాం. పలుచోట్ల డీఅడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం’’ అని కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు.