- ఇదే ఎన్డీయే ప్రభుత్వ విధానం
- రేషన్, ఆధార్ ఉంటే దీపానికి అర్హులే
- వాట్సాప్ మెసేజ్‌తోనే ధాన్యం కొనుగోలు
- ప్రతి ఇంటికీ కుళాయి నీళ్లు ఖాయం..
- ఎన్ని ఉద్యోగాలిస్తే.. అంత ప్రోత్సాహకాలు
- వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు
- శాసన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
- 162 రోజుల కూటమి పాలనపై నివేదిక
అమరావతి (చైతన్య రథం): ‘సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం. పేదల ఆదాయం పెరగాలి. ఖర్చులు తగ్గాలి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పనిచేస్తాం. సూపర్-6, మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఉండాలనేది ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం. ఎన్టీఆర్ రూ.2లకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు. అదిప్పుడు దేశం మొత్తం అమలైంది. పేదలకు పింఛను రూ.30లతో ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు రూ.50లకే హార్స్‌పవర్ విద్యుత్ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్లలోనని ఆలోచించి ఇళ్లు కట్టించారు. సగం ధరకే జనతా వస్త్రాల పంపిణీ చేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 162 రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం
కూటమి పాలన ప్రారంభమై 162 రోజులైందని, గాడి తప్పిన వ్యవస్థలను గాడిన పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పులు లేవని బయట ఇష్టానుసారం ప్రచారం చేశారని, రూ.10 లక్షల కోట్ల అప్పులను సాక్ష్యాలతో చూపించామన్నారు. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాలను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని, 2014లో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో పాలన ప్రారంభించినా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 27 సంక్షేమ పథకాలు, ముస్లింలకు 10 పథకాలతో పాటు బీసీలకు ఆదరణవంటి పథకాలతో ముందుకెళ్లామని, 127 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ బేబీ కిట్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తోపాటు, మహాప్రస్థానం అంబులెన్సులను ప్రవేశపెట్టామని, గెలిచిన వెంటనే పింఛను రూ.4వేలకు పెంచి.. 64 లక్షలమందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10 వేలు, రూ.15 వేలు అందిస్తున్నామని అంటూనే.. సంపన్న రాష్ట్రాలు సైతం ఇంతలా పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. పేదల కోసం ఇప్పటికే 198చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్టు సీఎం చంద్రబాబు సభకు వివరించారు. పేదలకు, ఆకలేసేవారికి కనీసం తిండిపెట్టడం మన బాధ్యత. ఇప్పటికి 1.18 కోట్లమంది అన్నక్యాంటీన్లలో భోజనం చేశారు. అన్ని దానాలకంటే అన్నదానం పవిత్రమైంది అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రేషన్, ఆధార్‌కార్డుంటే దీపం పథకానికి అర్హులే
‘ఆడబిడ్డలకు దీపం పథకం కింద సమైక్య రాష్ట్రంలో ఉచిత గ్యాస్ అందించాం. నా తల్లిపడిన కష్టాలు చూసిన వ్యక్తిగా గ్యాస్ పథకం పెట్టాను. ఆడబిడ్డలు తెచ్చుకున్న కట్టెలు వర్షాకాలంలో తడిచి మండక వారు పడే కష్టం అంతాఇంతా కాదు. నాడు వాజ్‌పేయ్‌ను ఒప్పంచి వంటగ్యాస్ అందించాం. ఇప్పుడు దీపం-2 పథకాన్ని అమలు చేశాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పథకం విధానాలు తెలియక కొందరు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇవ్వడానికి ఇది క్యాష్ కాదు, గ్యాస్. పథకం ప్రారంభించాక ఇప్పటి వరకు 42.40 లక్షలమంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు. రేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఎవరికున్నా అర్హులే అవుతారు. సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్లో జమవుతాయి’ అని చంద్రబాబు వివరించారు.
వాట్సాప్ లో మెసేజ్ పెట్టగానే ధాన్యం కొనుగోలు
‘వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టాం. వాట్సాప్‌లో ఒక్క మెసేజ్ పెడితే రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందిస్తాం. పేదలకు సంక్షేమాన్ని అమలు చేయడంతోపాటు అభివృద్ధి చేయడం మా ప్రభుత్వ విధానం. అభివృద్ధి చేసి ఆదాయం పెంచి పేదలకు పథకాలు అమలు చేస్తాం. అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. డిసెంబర్ నుంచి రాజధాని పనులు ప్రారంభమవుతాయి. పోలవరానికి రూ.12,127 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది’ అని చంద్రబాబు సభకు వివరించారు.
ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు
కేంద్రం ఇచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని సీఎం చంద్రబాబు వైసీపీని ఎండగట్టారు. రూ.4,500 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి సెంట్రల్లీ స్పాన్సర్ పథకాలకు నిధులు తెచ్చామని, జల్ జీవన్ మిషన్ పథకం కింద కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తామన్నారు. ‘పంచాయతీలకు రూ.990 కోట్లు విడుదల చేశాం. నరేగాలో ఎక్కడ పనిచేశారో గత ఐదేళ్లు చూళ్లేదు. ఆడిట్ చేయలేదు. మంచి పథకాన్ని భ్రష్టు పట్టించారు. నరేగా నిధులు ఉపయోగించుకుని గతంలో 25వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలుపెట్టి రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు ఆమోదం తెలిపాం’ అని చంద్రబాబు వివరించారు. ‘రాష్ట్రంలో ఏ రోడ్లు చూసినా భయంగా ఉంది. రోడ్లు మన నాగరికతకు చిహ్నం. గ్రామాల్లో రైతులు పండిరచే పంటలు మార్కెట్‌కు తీసుకెళ్లాలన్నా రోడ్లు కావాలి. ఉన్న రోడ్లను చూసి గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు విరక్తి కలిగింది. అందుకే గుంతలు పూడ్చేందుకు రూ.860 కోట్లు కేటాయించి పనులు చేపట్టాం. రూ.75 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. మరో రూ.30 వేల కోట్ల పనులు రానున్నాయి. రూ.72 వేల కోట్ల విలువైన రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి’ అని ఐదు నెలల పాలనాకాలంలో సాధించిన విజయాలను సీఎం చంద్రబాబు వివరించారు.
ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి మరింత ప్రోత్సాహకాలు
‘మా హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు భ్రష్టు పట్టించడం జరుగుతోంది. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించకపోవడంతో 4 లక్షల ఎకరాలకు నీరు అందలేదు. వీటిని కూడా సరిదిద్దుతున్నాం. జాబ్ ఫస్ట్ విధానంతో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. త్వరలోనే రాతపరీక్షలు పూర్తి చేసి నియామకాలు చేపడతాం. 25 కొత్త పాలసీలు తెచ్చాం. టూరిజం పాలసీని కూడా తెస్తాం. రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ల ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఈ రంగంలో రూ.3.75 లక్షల కోట్లతో 3,73,539 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తా’మని చంద్రబాబు తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాన్ని వివరించారు.
వాట్సాప్ ద్వారా 150 సేవలు అందుబాటులోకి
టెక్నాలజీ అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్ విధానం తీసుకురానున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తద్వారా అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. దేవాదాయ శాఖలో 56, ఎనర్జీలో 39, ఆర్టీసీలో 9, ఆర్టీఏలో 4, గ్రీవెన్స్‌లో 6, రెవెన్యూలో 16, మున్సిపల్ శాఖలో 28 సర్వీసులతో దాదాపు 150 సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. స్థానికత, బర్త్, డెత్, ఆదాయం, అడంగల్, స్టడీ సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారని, వాటిని ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించి అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు.