- ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అందజేసిన ప్రతినిధులు
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతమంటూ ప్రశంసలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ప్రతినిధులు అన్నారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును నరెడ్కో ప్రతినిధులు కలిశారు. రూ.75 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. గతంలో అందించిన రూ.25 లక్షలతో కలిపి మొత్తం రూ.కోటి విరాళాన్ని అందజేసినట్లయింది. ఈ సందర్భంగా నరెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఉపసంహరించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లభించిందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరచడం ద్వారా రాష్ట్ర నిర్మాణ రంగానికి ఎంతో మేలు చేశారు.
రియల్ ఎస్టేట్ రంగం, భవన నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్వా రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఏడాదిపాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. నరెడ్కో వినతిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా రంగాలు గాడిలో పడేందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో నిర్మాణరంగం కీలకమైనదన్నారు. మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో నాణ్యమైన గృహ నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పెట్టుబడులు, పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు అందించాలన్న ప్రభుత్వ ఆలోచన వినూత్నమైనదని, దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నరెడ్కో ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
భవన నిర్మాణాలకు సంబంధించి సింగిల్ విండో అనుమతులు అందించడం ఆ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా నిర్మాణరంగం పూర్వవైభవం సంతరించుకుంటుందని చెప్పారు. నిర్మాణరంగం ఆధారంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతాయి, తద్వారా ఉపాధి కల్పన పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో నరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు పరుచూరి కిరణ్‌కుమార్, యాగంటి దుర్గాప్రసాద్, తాళ్ళూరి శివాజీ, సెక్రటరీ జనరల్ మామిడి సీతారామయ్య, కోశాధికారి చావా రమేష్ బాబు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన డ్వాక్రా మహిళలు రూ.9 లక్షల విరాళాన్ని అందించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాన్ని అందిస్తున్న ఏపీ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు. చిత్రంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.