- క్వాష్ పిటిషన్ కొట్టివేత
- అరెస్ట్ నుండి రక్షణకూ నిరాకరణ
అమరావతి (చైతన్యరథం): దర్శకుడు రామ్ గోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కూడా నిరారించింది. దీంతో ఆర్జీవీని అరెస్టు చేయడానికి పోలీసులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయినట్లయింది. పిటిషనర్‌కి నోటీసులు జారీ అయ్యాయని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసుల విచారణకు మరికొంత సమయమివ్వాలని ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ అభ్యర్ధన పోలీసుల ముందు చేసుకోవాలని, కోర్టు ముందు కాదని వ్యాఖ్యానించింది.
గతంలో వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కూడా వర్మ అసభ్య పోస్టింగ్‌లు మానుకోలేదు. తాజాగా సోషల్ మీడియా కీచకులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఆర్జీవీపైనా కేసు నమోదయింది.