- ఇప్పటి వరకూ 40 లక్షల మంది బుకింగ్
- 30 లక్షల మందికి సిలిండర్ల డెలివరీ
- సమర్థవంతంగా పథకం అమలు
- అర్షులందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు
- మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి (చైతన్యరథం): లబ్ధిదారుల జీవితాల్లో దీపం-2 పథకం ద్వారా వెలుగులు నింపాలనే దృఢ నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇది గిట్టని విపక్షాల వారు అపోహల ద్వారా ప్రజల జీవితాలు అంధకారంలోకి నెట్టాలనే దురుద్దేశ్యంతో విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సోమవారం శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా దీపం-2-పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గత అక్టోబర్ 31వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లాలో దీపం పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 55 లక్షల మంది గ్యాస్ కార్డుదారులకు అర్హత కల్పించే విధంగా ఈ పథకం రూపొందించామన్నారు.
దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేసిందన్నారు.
దీపం కింద అర్హులైన కుటుంబాల వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం గత నెల 29వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వ తేదీ వరకూ బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన వారికి 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారని వివరించారు. ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారని చెప్పారు. వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారన్నారు.
దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు పొందేందుకు ముందు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలన్నారు. అలాగే రేషన్ కార్డు, చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు ఉండాలన్నారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో అనుసంధానం చేసి ఉండాలన్నారు. 1967 టోల్ ప్రీ నెంబరుకు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఈ పథకాన్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని విపక్ష సభ్యులకు హితవు పలికారు.