- ఎమ్మెల్యేలందరినీ 2029లో మళ్లీ గెలిపించుకుంటా..
- ఎమ్మెల్యే చైర్మన్‌గా ప్రతి సెగ్మెంట్‌లో ఇండస్ట్రియల్ పార్కులు
- టూరిజం అభివృద్ధికి డాక్యుమెంట్లు సిద్ధం చేయాలి
- గత ఐదేళ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టాం…
- ఇక వేగం పెంచాల్సిన తరుణం ఆసన్నమైంది
- ఉచిత ఇసుక అమలు బాధ్యత ఎమ్మెల్యేలదే
- అక్రమాలు నా దృష్టికి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటా
- ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- బాబు ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామన్న డిప్యూటీ సీఎం
అమరావతి (చైతన్య రథం): కూటమి ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండాలని, ప్రజలతోనే ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీలో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులైంది. ఆ సమయంలోనే దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తూ ముందుకెళ్తున్నాం. నేను నాలుగో సారి సీఎం అయ్యా… కానీ ఎప్పుడూ ఇంతటి వ్యవస్థల విధ్వంసం చూడలేదు. వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయి. లోతుకు వెళ్లే కొద్దీ భయంకర విషయాలు బయటపడుతున్నాయి. వాటన్నింటినీ గాడిన పెట్టాం. ఇక వేగం పెంచాల్సిన అవసరముంది. అధికారంలోకి రాగానే 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. ఐదేళ్ల విధ్వంసాలను వాస్తవ రూపంలో ప్రజలకు వివరించాలని శ్వేతపత్రాలు విడుదల చేశాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని ఎన్నికలముందు పిలుపునిచ్చాం. ప్రజలు మనపక్షాన నిలిచి గెలిపించారు… ఇప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు.
కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండటం అదృష్టమంటూ.. కేంద్ర సహకారం లేకుంటే ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు కష్టమయ్యేదని బాబు అభిప్రాయపడ్డారు. మనం చేసిన పనులు ప్రజలకు వివరిస్తూ ఒక్కొక్కటి అధిగమించడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ఏడు శ్వేతపత్రాల్లోని అంశాలు ఎంతమందికి తెలిస్తే అంత మంచిదని చంద్రబాబు సూచించారు. 150 రోజుల్లో అనేక హామీలు అమలు చేశామంటూ.. సామాజిక పెన్షన్లు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ పేషెంట్లకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలకు పెంచామన్నారు. 64 లక్షల మందికి ఏ రాష్ట్రంలో ఇవ్వని స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని, అన్న క్యాంటీన్లతో పాటు దీపావళి నుండి దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. ‘చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని కూడా జోడెద్దుల బండి మాదిరి ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. సంపద పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేయవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నాం.
2047నాటికి 43 వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని బాబు వివరించారు. ఇప్పటికే శాండ్, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, లిక్కర్ పాలసీలు ప్రవేశపెట్టామని, దీనిపైనా అసెంబ్లీలో చర్చలు జరగాల్సి ఉందన్నారు. క్లీన్ ఎనర్జీ, డ్రోన్, ఎలక్ట్రానిక్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు కూడా తెచ్చామని, రాబోయే ఐదేళ్లు మీరు టూరిజంపై శ్రద్ధ పెడడితే ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరుగుతాయని ఉద్భోదించారు. రాష్ట్రంలో టూరిస్టులు ఒక్కరోజు మాత్రమే ఉంటున్నారని టాటా సంస్థ ప్రతినిధులు కూడా చెప్పారంటూనే.. మన రాష్ట్రంలో మంచి ప్రదేశాలున్నా హోటల్స్, ఇతర వసతులు లేవని అంటున్నారు. టూరిజానికి కావలసింది కనీసం రూములు, హాస్పిటల్స్, ఈవెంట్స్, ట్రావెల్ సదుపాయాలు అని సీఎం వివరించారు.
గండికోట టాప్ 10 స్థానాల్లో ఒకటి. రాష్ట్రంలో మంచి రిజర్వాయర్లు, హిల్స్, టైగర్ జోన్ వంటి ప్రాంతాలున్నా మార్కెటింగ్ చేయలేకపోయాం. టెంపుల్స్‌లో తిరుమల, కాణిపాకం, లేపాక్షి, శ్రీశైలం, కనకదుర్గమ్మ దేవాలయం, అన్నవరం వంటివి ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని టూరిజంను అభివృద్ధి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపైనా ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడాం. జిల్లా వారీగా ఏబీసీ కేటగిరీలు పెట్టి జిల్లా, జోన్, స్టేట్ వారీగా కమిటీలు వేసి అమలు చేస్తాం. 2028 లేదా 2027 నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. కేంద్రం కూడా రూ.12,500 కోట్లు నిధులు ఇచ్చింది. దీంతో ఫేజ్ 1 ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫేజ్ 2లో ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మలివిడత నదుల అనుసంధానికీ ఆలోచన చేస్తున్నామని, గోదావరి నుండి కృష్ణా, కృష్ణా నుండి పెన్నాకు నీళ్లు తీసుకెళ్లాలి. గోదావరి నీళ్లు సీమకు వెళ్తే గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ యేడాది పోలవరం నుండి అనకాపల్లికి, ఆ తర్వాత విశాఖకు నీళ్లు తీసుకెళ్తామని, అనంతరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు అనుసంధానం చేస్తామన్నారు.
అమరావతికి కేంద్రం ఏడీబీ, ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. మూడేళ్లలో అనుకున్న ప్లాన్ ప్రకారం రాజధానిని పూర్తి చేస్తాం. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను రీ ఆర్గనైజేషన్ చేయాల్సి ఉంది. అకౌంటబిలిటీ సెట్ చేసి అన్ని సచివాలయాలను ఇంటిగ్రేట్ చేసి మరింతగా సేవలందించేలా చేస్తాం. ఆధార్ కార్డు ప్రతి భారతీయుడికి ఐడెంటిటీ. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా అందులో డేటా ఉండేలా కేంద్రం రూపకల్పన చేసింది. అపార్ ద్వారా విద్యార్ధుల డీటెయిల్స్ ట్రాకింగ్ ఉంటుంది. ఇటీవల 10 పాలసీలు తెచ్చాం. ఈ 10 పాలసీలను మేజర్‌గా పెట్టుకుని విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. జీరో పావర్టీలో అందరూ అనుసంధానం కావాలి అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. పీ4 ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రయత్నిస్తామని, మనం తెచ్చిన పాలసీలన్నీ ఉద్యోగ కల్పనకు ఉపయోగపడుతాయి. ఉద్యోగాలు ఎక్కువ కల్పించే సంస్థలకు 10 శాతం అదనంగా ప్రోత్సాహకాలు కల్పిస్తామని చెప్పాం. ఒక కుటుంబం. ఒక పారిశ్రామికవేత్త అనే నినాదం తీసుకొచ్చామన్నారు.
రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురంలో కూడా హబ్‌లు ఉంటాయన్నారు. టాటా సంస్థ 10 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, సత్యం వంటి దాదాపు 10 పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వర్చువల్ వర్కింగ్ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఉంటుంది. ఎమ్మెల్యేలే దానికి ఛైర్మన్లుగా ఉంటారు. అక్కడ పరిశ్రమలు పెట్టించే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా తీసుకోవాలన్నారు. లాజిస్టిక్ కాస్ట్ కటింగ్‌లో భాగంగా పోర్టులు నిర్మాణం, జాతీయ రహదారులు నిర్మాణం వేగంగా చేపడతామని, పంచాయతీల్లో చేపట్టిన పనులు కూడా జనవరిలోపు పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారన్నారు.
మనం అధికారంలోకి రాగానే పంచాయితీలకు రూ.900 కోట్లు మంజూరు చేశామని, మరో రూ.1000 కోట్లు కూడా రానున్నాయని సీఎం వివరించారు. రూ.860 కోట్లతో రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టి మహర్ధశ తీసుకొస్తాం. అక్కడ సక్సెస్ అయితే కృష్ణా, గుంటూరులో అమలు చేస్తాం. సామాన్యులకు ఎటువంటి భారం లేకుండా రోడ్ల నిర్వహణ చేపడతామన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కేంద్రం ఇచ్చిన జల్ జీవన్ మిషన్ నిధులను కూడా గత ప్రభుత్వం మళ్లించింది. ఆ నిధులు మనం మంజూరు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని సీఎం వివరించారు. అలాగే, ప్రతి ఎకరాకూ నీరందిస్తామని, రైతుల ఆదాయం పెంచడానికి శ్రద్ధ పెడతున్నామని, ప్రతి రైతు కుంటుంబం నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలన్నారు. డ్రోన్స్ ద్వారా పిచికారీ చేస్తే సమయం, ఖర్చు తగ్గుతుంది. భూసార పరీక్షలు కూడా విధిగా నిర్వహిస్తాం.
జనాభా నిర్వహణ చేయాల్సి ఉందంటూనే, 1.7 నుండి 2.7కు పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలన్నారు. ఎనర్జీలో పెనుమార్పులు వస్తున్నాయి. గతంలో వాహనాలు పెట్రోల్, డీజల్‌తో నడిచాయి. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ నుండి గ్రీన్ హైడ్రోజన్‌కు వెళ్తున్నాం. అందుకే గ్రీన్ బడ్జెట్ అని మాట్లాడుతున్నాం. గ్రీన్ ఎనర్జీతో తయారవ్యేవి టెంపరేచర్‌ను తగ్గిస్తాయని సీపం వివరించారు. లాజిస్టిక్స్, ఫ్యూయల్, ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తే అన్ని విధాలా ముందుకెళ్తాం. డ్రోన్స్, సీసీ, సెల్, ఐఓటీలతో రియల్ టైం డేటా వస్తుంది. ప్రతి ఒక్కరూ పేదలతో మమేకమవ్వాలి. వారి కనీస అవసరాలు తీర్చాలి. మీ నియోజకవర్గాల్లో టూరిజం ప్రాంతాలను గుర్తించాలి. టూరిజంపై ఎంత ఫోకస్ చేస్తే అంత ఉపాధి కల్పన జరుగుతుంది. టూరిజంలో రూపాయి ఖర్చు చేస్తే ఆరు రూపాయల ఆదాయం వస్తుంది. టూరిజం రంగంలో ఎక్కువ కష్ట పడాల్సిన అవసరం ఉండదు. ప్రజలకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం టూరిజంపై ఖర్చు చేస్తున్నారు. మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ఆదాయాన్ని రాబట్టవచ్చని చంద్రబాబు శాసన సభా పక్షానికి హితబోధ చేశారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని, సమస్యలుంటే నాకు రిపోర్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. దీపం `2 పథకంలో సమస్యలు వస్తే తక్షణమే పరిష్కరిస్తామని, తానూ, పవన్ కళ్యాణ్ చెప్పేది ఆచరించాల్సింది ఎమ్మెల్యేలే అన్నారు.