- అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ అవసరం
- సులభతర పౌరసేవలకు సహకరించండి
- ఏడబ్ల్యుఎస్ ఎండి రేచల్ స్కాఫ్‌తో లోకేష్
- ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో ఐటీ మంత్రి అప్పీల్
లాస్ వెగాస్ (యుఎస్ఎ): అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల జైత్రయాత్ర కొనసాగుతోంది. లాస్ వెగాస్‌లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి లోకేష్ అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా రేచల్ స్కాఫ్ మాట్లాడుతూ… క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్‌పై అమెజాన్ దృష్టి సారించినట్టు వివరించారు. ప్రపంచ మార్కెట్లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో ఏడబ్ల్యుఎస్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఏఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. రేచల్ స్కాఫ్ డిస్కషన్స్‌కు ఐటీ మంత్రి లోకేష్ స్పందిస్తూ.. ఏపీలో స్మార్ట్ గవర్నెన్స్‌కు క్లౌడ్ సర్వీసెస్ అందించాలని కోరారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యుఎస్ నాయకత్వం ఉపకరిస్తుందన్నారు.
స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యుఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయని వివరించారు. ఏఐ, మిషన్ లెర్నింగ్‌లో అమెజాన్ చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఏఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ ఆశయానికి ఊతమిస్తాయని అన్నారు. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్ల స్థిరత్వానికి ఏడబ్ల్యుఎస్ కట్టుబడి ఉండటం, 2030నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉందని అన్నారు. స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలికసదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయని అంటూ.. ఏడబ్ల్యుఎస్ తదుపరి డేటాసెంటర్కు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో మౌలికసదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు ఏడబ్ల్యుఎస్ సహకారం అవసరమని, ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారం కోరుతున్నామని మంత్రి లోకేష్ అన్నారు. దీనిపై రేచల్ స్పందిస్తూ ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్‌తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇతర డిమాండ్‌వున్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక కోడిరగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని వర్శిటీలు, సాంకేతిక సంస్థలతో కలసి పనిచేయాలన్నారు. ఏపీలో స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతోందని, స్థానిక స్టార్టప్‌లు, చిన్న- మధ్యతరహా సంస్థలకు టెక్ టాలెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాన్ని అందించడంలో మీవంతు సహకారం అందించాలని కోరారు. ఈ-గవర్నెన్స్, స్మార్ట్ సిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో పని చేయడానికి శిక్షణ పొందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని లోకేష్ కోరారు.