- 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్ట్ నిర్మాణం
- 150 అడుగులమేర నీటిని నిల్వ చేస్తాం
- నదులను అనుసంధానంతోనే అది సాధ్యం
- రెండు ఫేజుల డ్రామా వైసీపీ నిర్వాకమే..
- ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకు కుదించారు
- మీడియాతో జలవనరుల మంత్రి రామానాయుడు
అమరావతి (చైతన్య రథం): పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని, గతంలో తాము ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండేలా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రెండు ఫేజులంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదేనని తప్పుపట్టారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజుల్లో నిర్మిస్తామంటూ, ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపిన గత ప్రభుత్వం, ఆ బురదను తమ ప్రభుత్వంపై రుద్దేలా దుష్ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 మరియు 2 అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సిఎస్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఇఓకు లేఖ వ్రాస్తూ రూ.10,911.15 కోట్ల మేర నిధులు రావాలని అడిగారన్నారు. తదుపరి జలవనరుల శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, సిఇ తదితరులు కూడా పలమార్లు లేఖలు వ్రాయడం జరిగిందన్నారు. వాటిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లు అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగిందన్నారు.
2014-19 మధ్యకాలంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును ఫేజ్-1, 2 అని ఎప్పుడూ విభజించలేదని, సుప్రీమ్ కోర్టు, గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 150 అడుగులమేర నీటిని నిల్వ చేసేలా 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.55,545 కోట్లకు టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ ఆమోదాన్ని పొందడం జరిగిందన్నారు. తమ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఏమాత్రం రాజీ పడబోదని, నూటికి నూరుశాతం 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అయితే గత ప్రభుత్వం ఫేజ్-1, 2లో పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు ప్రతిపాదించిన విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిధులు విడుదలవుతాయన్నారు. కానీ ఫేజ్-1, 2లో మాత్రం 45.72 మీటర్ల మేర ప్రాజెక్టు ఎత్తుకు అనుగుణంగా రూ.30 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు అవసరమవుతాయని తాము ప్రతిపాదించామన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్లే 2020లో వచ్చిన వరదలకు డయాప్రమ్ వాల్ దెబ్బతిందని హైద్రాబాద్ ఐఐటీ నిపుణుల బృందం కూడా నిర్థారించినట్లు చెప్పారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై రూ.11,762 కోట్లు ఖర్చు చేస్తే, కేవలం రూ.6,764 కోట్లు మాత్రమే కేంద్రం నుండి రీయింబర్స్‌మెంట్ రూపేణా వచ్చాయన్నారు. అయితే గత ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లను మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిందని, అయితే కేంద్రం నుంచి రూ.8,382 కోట్లు రీయింబర్స్‌మెంట్ రూపేణా నిధులు వస్తే అందులో రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం డైవర్టు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఫేజ్-1, 2 ప్రతిపాదించిన విధంగా కేంద్రం నుండి రూ.12,250 కోట్ల నిధులు ఈ మధ్యనే అందాయని, అదే గత ప్రభుత్వ హయాంలో అందితే ఈ నిధులను కూడా డైవర్టు చేసి ఉండేవారని మంత్రి రామానాయుడు వ్యాఖ్యానించారు.