- గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- సీఎం చంద్రబాబుతోనే పల్లెలకు పూర్వ వైభవం
- గ్రామాల్లో రోడ్లకు మహర్దశ
- 125 రోజుల్లో రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం
- బీటీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి సంధ్యారాణి
సాలూరు (చైతన్యరథం): గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట, కొత్తవలస పంచాయతీల పరిధిలోని చంద్రపువలస, చిన్నవలస, గుండ్రపువలస గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమంలో సోమవారం మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.1.60 కోట్లతో చంద్రపువలస నుండి ముగడవలస వరకు, రూ.50 లక్షలతో చిన్నయ్యవలస నుండి పునికిలవలస జంక్షన్ వరకు, రూ.1.55 కోట్లతో గుండ్రపువలస నుండి ఖరాసువలస వరకు.. మొత్తం రూ.3.65 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేసారు. దాగరవలస నుండి ఎగువ దాగరవలస వరకు రూ.2.80 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తోందన్నారు.
గ్రామాల్లోని ప్రజల మౌలిక వసతులకు ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏర్పడిన 125 రోజుల్లోనే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా 3 వేల కి.మీ. మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం, 500 కి.మీ. మేర బీటీ రోడ్ల నిర్మాణం జరగనుందని చెప్పారు. ఎక్కడైనా సమస్యను గుర్తించిన వెంటనే దానిని పరిష్కరిస్తున్నామన్నారు. మొదటి దఫా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలోనే రెండవ దఫా నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటినుండే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు.
దశలవారీగా హామీల అమలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలవల్ల రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిరదన్నారు. అసమర్థ పాలనతో అన్ని రంగాలను, వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు అధికారం లేకుండా చేయడమే కాకుండా, అభివృద్ధి లేమికి వారిని బాధ్యులను చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్‌లకు పూర్తి అధికారాలిచ్చి, గౌరవం కల్పించిందని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.