పైకి శ్రీరంగ నీతులు చెబుతూ.. ప్రజలను దగా చేయడంలో జగన్‌రెడ్డి మాస్టర్స్ చేశారనడానికి `గత ఐదేళ్ల విధ్వంస పాలనలో ఎన్నో దుష్టాంతాలు. వాటిలో జె`బ్రాండ్ మద్యాన్ని ప్రత్యేక చాప్టర్‌గా ప్రస్తావించాలి. నాసిరకం మద్యంతో ప్రజారోగ్యాన్ని జలగలా పీల్చేసిన జగన్‌రెడ్డి దాష్టీకాలు.. కూటమి ప్రభుత్వం వేసిన సీఐడీ దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
‘కాపురాల్లో మద్యం చిచ్చుబెడుతోంది. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అందుకే అధికారంలోకి రాగానే.. మద్య నిషేధాన్ని అమలు చేస్తాం’ అంటూ.. 2019 వైసీపీ మ్యానిఫెస్టోలో శ్రీరంగ నీతులు పలికిన జగన్‌రెడ్డి.. గద్దెనెక్కగానే మద్య నిషేధం మాట మర్చిపోయాడు. మద్యం విధానాన్నే మంటగలిపి.. నాసిరకం మద్యాన్ని రాష్ట్రంలో పారించి కాసులు దండుకోవడం మొదలుపెట్టాడు. నిషేధాన్ని నీరుగార్చడం ఒకెత్తు. ప్రయివేట్ మద్యం విధానాన్ని రద్దు చేయడం మరో ఎత్తు. నేరుగా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించి.. ప్రయివేట్‌గా సొమ్ము చేసుకునే కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం `జగన్‌రెడ్డి దోపిడీ రాజకీయ విధానానికి పరాకాష్ట. ఈ విధానంతోనే `రాష్ట్రంలోని మద్యం తయారీ కంపెనీలను గుప్పెట్లోకి తెచ్చుకుని.. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్మి రూ.వేల కోట్ల సంపదను తాడేపల్లి ప్యాలెస్‌కి తరలించుకున్నారు. దేశంలో ఎక్కడా దొరకని కల్తీ బ్రాండ్ల విషపూరిత మద్యం రాష్ట్రంలోకి దించి.. అధిక రేట్లతో మద్యంప్రియుల రక్తాన్ని జుర్రుకున్న ఘట్టం ఐదేళ్లపాటు నిరాఘాటంగా సాగిపోయిందన్నది ప్రపంచానికి తెలిసిన పచ్చి నిజం. ఐదేళ్ల పాలనలో విషపూరిత మద్యానికి దాదాపు 40 లక్షలమంది ఆరోగ్యం ఛిద్రమైంది. 35 వేలమంది నాసిరకం మద్యానికి బలైపోయారు. జగన్ విధానాలను జనం తిప్పికొట్టడంతో `కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటవ్వడమే తరువాయి.. ఎన్నికల హామీని అమలు చేస్తూ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. వైసీపీ వదిలివెళ్లిన నాసిరకం మద్యానికి చెక్ పెడుతూ.. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. పైగా దోపిడీకి అవకాశం లేకుండా పారదర్శకంగా డిజిటల్ చెల్లింపులను ఆమోదించడం కంటికి కనిపిస్తోన్న దృశ్యమే. అయితే వైసీపీ విషపూరిత మద్యం, డ్రగ్స్‌వల్ల రాష్ట్రంలో 100 శాతం ఆత్మహత్యలు, 52శాతం లివర్ సమస్యలు, 54శాతం కిడ్నీ సమస్యలు పెరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లోని డీ అడిక్షన్ సెంటర్‌లో 1300 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. మద్యంపై వచ్చే రూ.18,860 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి రాకుండా బేవరేజెస్ కార్పొరేషన్‌కి మళ్లించారు.
గత ఐదేళ్లలో నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి మద్యం దుకాణాల నుంచి వచ్చిన సొమ్ముకు లెక్కలు చూపకుండా.. మరోవైపు డిజిటల్ పేమెంట్లకు అనుమతించకుండా వైసీపీ ముఖ్యనేతలనుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని అందినంత దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే భారీ కుంభకోణాన్ని వెలికితీసే బాధ్యతను సీఐడీకి అప్పగించింది. అందులో భాగంగానే చిత్తూరు, కడప, నెల్లూరు, నంద్యాల, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోవున్న 20 డిస్టలరీలపై ఏకకాలంలో సోదాలు జరిపిన సీఐడీ కూపీ లాగడం ప్రారంభించింది.
మద్యంలో రూ.వేల కోట్లు దోచుకున్న జగన్‌రెడ్డి
2019 అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రత్యేకంగా ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి ఏపీఎస్‌బిఎల్ ఎండీగా నియమించి లిక్కర్ సరఫరా మొత్తాన్ని వైసీపీ నేతలు చేతుల్లోకి బలవంతంగా తెచ్చుకున్నారు. మద్యంలో ఎంఎన్‌సీ కంపెనీలను తరిమేసి ఆన్‌లైన్‌లో కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని మాన్యువల్ చేసి సొంత వాళ్లకు 90శాతం అర్డర్లు ఇచ్చి కమిషన్ల రూపంలో రూ.8వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కి తరలించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసి రూ.వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. గత వైసీపీ పాలనలో మద్యంలో జరిగిన కుంభకోణంపై సిఐడీ విచారిస్తోంది.
మద్యం ఆర్డర్లన్నీ జగన్‌రెడ్డి అనుమాయులకే..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం తయారీ కంపెనీల యజమాన్యాన్ని బెదిరించి బలవంతంగా కంపెనీలను వైసీపీ నేతలు లాక్కున్నారు. వైసీపీ హయాంలో 28 లిక్కర్ బ్రాండ్లు, 10 బీరు బ్రాండ్లు.. కొత్తగా వచ్చిన ఎస్‌ఎన్‌జే, అదాన్, లీలా, ఎన్‌వీ, బీ9, సోనా, మూనక్… కంపెనీలకు రూ.15,843 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద ఏపీఎస్‌బీసీఎల్‌లో 100 వరకు రిజిస్టర్‌కాగా 90శాతం మద్యం ఆర్డర్లు జగన్‌రెడ్డి అనుయాయులకే అప్పగించారు. నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అర్డర్లు ఇవ్వకుండా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బినామీ కంపెనీకి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి వేల కోట్లు కమిషన్ల రూపంలో దోచుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి డిస్టిలరీ లేకున్నా భారీగా మద్యం ఆర్డర్లు ఇచ్చి కుంభకోణానికి తెరలేపారు.
జే బ్రాండ్లలో ప్రాణాలు తీసే విషపదార్థాలు
గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ల తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారు. జే బ్రాండ్స్‌కి చెందిన సెలబ్రిటీ, గ్రీన్ ఛాయస్, రాయల్ సింహ, ఛాంపియన్, ఓల్డ్ టైమర్ అనే 5 బ్రాండ్లను చెన్నైకి చెందిన ఎస్జిఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డీప్ కెమికల్ అనాలిసిస్ చేయించగా వాటిలో వోల్కెనెనిన్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనంతో పాటు బెంజోక్వినోన్, స్కోపరోన్, పైరోగల్లోల్ లాంటి ఇతర ప్రమాదకరమైన రసాయనాలు గుర్తించినట్టు తేలింది. ఈ బ్రాండ్లు తాగిన వారిలో గుండెపోటు? అల్ప రక్తపోటు? వాంతులు, కడుపునొప్పి, మానసిక సమస్యలు తలెత్తి చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వంలో నూతన మద్యం పాలసీ అమలు
ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. నూతన విధానంతో నాణమైన మద్యం తక్కువ ధరకే క్వార్టర్ రూ.99కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తెచ్చింది. గత నాసికరమైన మద్యానికి చెక్ పెడుతూ.. 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటుకి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం నూతన విధానంవల్ల 3,396 షాపుల లైసెన్సు కొరకు 90వేల దరఖాస్తుల రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.18వేల కోట్లు ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వం మద్యం విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కి చేరింది. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు 26 జిల్లాల్లో జిల్లాకో నార్కోటిక్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. జగన్‌రెడ్డి గత ఐదేళ్లు చేసిన పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మద్యంలో జగన్‌రెడ్డి ముఠా చేసిన కుంభకోణం కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది.
` మంగినపల్లి ఎలీషా బాబు, పొలిటికల్ అనలిస్ట్