- కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో నిధులిచ్చేందుకు ముందుకొస్తున్న సంస్థలు
- తాజాగా రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో అంగీకారం
- ఢిల్లీలో హడ్కో అధికారులతో మంత్రి నారాయణ చర్చలు ఫలప్రదం
- ఇప్పటికే రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకారం
- అమరావతి ఫేజ్`1 పనులకు అవసరమైన రూ.26 వేల కోట్లు సమకూరినట్లే
అమరావతి,న్యూఢిల్లీ (చైతన్యరథం): రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో వేగంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి అన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి. అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా రూపుదిద్దాలనుకుంటున్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయి. అమరావతి నిర్మాణానికి సహకరించేందుకు వివిధ బ్యాంకులు, సంస్థలు అంగీకరిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల, మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయణ కృషితో అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇప్పటికే గత శనివారం అమరావతి పునఃనిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాజధానిలో భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి నిర్దేశిత గడువును పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకువెళుతోంది.
రూ.11 వేల కోట్ల రుణానికి హడ్కో ఓకే
రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులు అభివృద్ది, రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సదుపాయం వంటి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు, మిగిలిన పనుల పూర్తికి రూ.50 వేల కోట్లు అవసరమవుతుందని అంచనా వేసారు. అయితే వీటిలో మొదటి విడత పనుల పూర్తికి రూ.26 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేసారు. ఈ నిధుల సమీకరణ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టిసారించింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు కలిసి రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. ఇక మిగిలిన 11 వేల కోట్ల నిధుల మంజూరుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అంగీకారం తెలిపింది. సోమవారం దేశ రాజధాని ఢల్లీిలో పర్యటించిన మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయణ, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. హడ్కో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హడ్కో సీఈవో సంజయ్ కుల్ శ్రేష్ట, హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఆలోచనను హడ్కో అధికారులకు మంత్రి నారాయణ పూర్తి స్థాయిలో వివరించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు సంతృప్తి చెందిన హడ్కో సీఈవో అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీయేకు రూ.11 వేల కోట్ల రుణం మంజూరుకు అంగీకారం తెలిపారు. అదే విధంగా మంత్రి నారాయణ విజ్ఞప్తి మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు అభివృద్ధి పనులకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా పెండిరగ్‌లో ఉన్న రూ.165 కోట్ల రుణం విడుదలకు కూడా హడ్కో అధికారులు అంగీకరించారు. వారం రోజుల్లో రుణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
రుణం మంజూరుతో అమరావతి నిర్మాణం వేగవంతం
అమరావతి ఫేజ్ – 1 నిర్మాణానికి రూ. 26 వేల కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా, తాజాగా రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో ఆమోదించటంతో అవసరమైన నిధులు సర్దుబాటు అయినట్లే. రూ. 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ 26 వేల కోట్ల నిధులు విడుదల అయితే రాజధాని పనులు వేగంగా ముందుకు సాగనున్నాయి.