అమలాపురం: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపే శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు సమాచారం. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్ 6న హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేష్‌ను పోలీసులు ఈ నెల 18న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దళిత యువకుడిది హత్యే అని పోలీసుల విచారణలో ధర్మేష్ వెల్లడిరచారు. మృతుడు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లకు ధర్మేష్ సన్నిహితంగా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారని పోలీసులు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించాలనుకున్న శ్రీకాంత్.. ధర్మేష్ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో వెల్లడయింది.
అయినవిల్లి గ్రామానికి చెందిన జనుపల్లి దుర్గాప్రసాద్ అదే గ్రామంలో వాలంటీర్‌గా పనిచేసేవాడు. పినిపే విశ్వరూప్‌కు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గాన్ని ఆయన కుమారుడు శ్రీకాంత్ చూసుకునేవారు. ఆ తర్వాత తనకు పి.గన్నవరం వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు అప్పటి సీఎం జగన్ అంగీకరించారని చెబుతూ అక్కడ రాజకీయ పర్యటనలు చేశారు. ఆ సమయంలో ఆయనకు అనుచరుడిగా ఉన్న దుర్గాప్రసాద్ కొద్ది రోజుల్లోనే ముఖ్యఅనుచరుల్లో ఒకడుగా మారారు. అయితే 2022లో కోనసీమలో జిల్లా పేరు మార్పుపై అల్లర్లు జరిగాయి. నెల రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యాడు. అల్లర్ల కేసులకు భయపడి దుర్గాప్రసాద్ ఎక్కడికో పారిపోయాడని ప్రచారం చేశారు. కానీ తరువాత ముక్తేశ్వరం-కోటిపల్లి రేవు వద్ద దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటికే మృతుని భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదుకాగా దానిని అనుమానాస్పద మృతిగా కేసు మార్చారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో మెడ ఎముక విరిగి మృతిచెందినట్లు వెల్లడి అయింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో విశ్వరూప్ మంత్రిగా ఉండంతో రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఆ కేసును పెండిరగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరో దళత యువకుడి హత్య కూడా జరిగిందని అదికూడా రాజకీయ ఒత్తిళ్ల మేరకు పెండిరగ్‌లో ఉండిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నింటిపై ఇప్పుడు విచారణ జరిపి అరెస్టు చేసి హత్య కేసు నిందితుల్ని అరెస్టు చేస్తున్నారు. పోలీసులకు విషయం తెలిసిపోయిందని అనుమానం రావడంతో విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పరారయ్యారు. చివరికి తమిళనాడులోని మధురైలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
మెడకు తాడు బిగించి..
హత్యకు అమలాపురంలోని ఓ ప్రముఖ లాడ్జిలో పథక రచన చేసినట్లు సమాచారం. దుర్గాప్రసాద్‌ను ధర్మేష్ కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లగా, వెనుక కారులో నలుగురు అనుసరించారు. రేవు వద్ద ఓ వ్యక్తి పడవలో లోపలకు తీసుకెళ్లగా, కారులో వచ్చిన వారిలో ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి, హత్య చేశారని నిందితుడు ధర్మేష్ చెప్పినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కొన్నాళ్లకు మృతదేహం లభించగా, పోస్టుమార్టంలో హత్య చేసినట్లు నిర్ధ్ధారణ అయింది.