- అందుకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక ప్రక్షాళన
- నెలాఖరులోగా మంగళగిరిలో స్కిల్ సెన్సస్ పూర్తిచేయాలి
- మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుకు ప్రణాళికలు సిద్ధం చేయండి
- స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభించే విధంగా పాఠ్యప్రణాళికలను ప్రక్షాళన చేయాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… తమ హయాంలో ఐటిఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానానికి అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం పనిచేయాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం చేపట్టే కార్యక్రమాల్లో అంతిమంగా మంచి ఫలితాలు రావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా అనంతపురంలో ఆటోమోటివ్, కడప, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం జిల్లాలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాల్లో ఆక్వా, పెట్రో కెమికల్స్, ఉత్తరాంధ్రలో ఐటి, ఫార్మా, డిఫెన్స్ రంగాలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.. ఆయా ప్రాంతాల్లోని ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు.
విదేశాల్లో బ్లూకాలర్ జాబ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉందని, డిమాండ్ ఉన్న బ్లూకాలర్ జాబ్స్‌ను గుర్తించి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఒక్క జపాన్‌లోనే 50వేలమంది బ్లూ కాలర్, నర్సింగ్ ఉద్యోగులు కావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మోడల్ కెరీర్ సెంటర్లు మంజూరు కాగా, 12 ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు తెలుపగా, మిగిలినవి కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న స్కిల్ సెన్సస్ పురోగతిపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇప్పటివరకు 63,966 గృహాల్లోని 1,12,680 మందికి (42%) నైపుణ్యగణన పూర్తయిందని చెప్పారు. నియోజకవర్గంలో నెలాఖరు నాటికి స్కిల్ సెన్సస్ పూర్తిచేయాలని, ఇక్కడ గుర్తించిన లోపాలను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్‌కు శ్రీకారం చుడతామని మంత్రి లోకేష్ చెప్పారు. స్కిల్ సెన్సస్ డేటాను ఇన్ఫోసిస్ వంటి ప్రఖ్యాత సంస్థలతో ప్రివాలిడేషన్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా రాబోయే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ సెన్సస్ డేటా సిద్ధం చేయాలని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో రాష్ట్రంలోని ప్రధాన కంపెనీల హెచ్‌ఆర్ లతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవాలని సూచించారు.
మంగళగిరి నియోజకవర్గంలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. కర్నాటకలోని ఉడిపిలో ఉన్న జెమ్స్ అండ్ జ్యుయలరీ సెంటర్‌ను అధ్యయనం చేశామని, త్వరలో ఆ సంస్థ అధికారులను రాష్ట్రానికి ఆహ్వానించి, వారి సూచనలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో 7 ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్‌ను కేంద్రప్రభుత్వ జాబ్ పోర్టల్‌తో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ సూచించారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి గుమ్మల దినేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఇమ్మని మోహన్, తదితరులు పాల్గొన్నారు.