అమరావతి(చైతన్యరథం): గతంలో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన కిడ్నీ డయాలసిస్ యూనిట్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన గురువారం సాయంత్రం విజయవాడ నుండి విమానంలో బయలుదేరి 6.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో రాత్రి 8.20 గంటలకు బంగారుపాళ్యం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 20వ తేదీ శుక్రవారం ఉదయం 10`11 గంటల మధ్య బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తారు. 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు బంగారుపాళ్యంలో ప్రజావేదిక కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. బంగారుపాళ్యం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని విమానంలో సాయంత్రం 5.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
మంత్రి నారా లోకేష్ గత ఏడాది చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాదయాత్ర పూర్తయిన ప్రతి 100 కిలోమీటర్ల వద్ద ఒక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొదటి 100 కిమీ మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకున్నారు. దాంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చి ఆ మేరకు శిలాఫలకం లో పొందుపరిచారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే బంగారుపాళ్యంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని సిద్ధం చేసి మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభిస్తున్నారు.