- మీరు మా వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఆనందంగా ఉంది
- భూముల ధరలో రాయితీ ఇవ్వండి
- పన్నుల భారం తగ్గించి స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ చేయండి
- ముఖాముఖి సమావేశంలో మంత్రి లోకేష్‌కు ఐటి పరిశ్రమదారుల విన్నపం
విశాఖపట్నం(చైతన్యరథం): గత ఐదేళ్లుగా మా సమస్యలు పట్టించుకున్న నాథుడే లేడు, ఒక్కసారి కూడా ప్రభుత్వ పెద్దలు మా వద్దకు రాలేదని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వద్ద ఐటి పరిశ్రమదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటి అసోసియేషన్ ఆధ్వర్యాన విశాఖపట్నం నోవాటెల్ హోటల్‌లో మంత్రి లోకేష్ గురువారం సాయంత్రం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటి పరిశ్రమదారులు మాట్లాడుతూ… ఐదేళ్ల తర్వాత మా వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నది మీరు మాత్రమే, మాకు ఎంతో ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటి పరిశ్రమదారులు తమ సమస్యలను తెలియజేస్తూ… గత ఐదేళ్లుగా విశాఖలో మిలీనియం టవర్స్, ఇతర ప్రాంతాల్లో 3లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ఖాళీగా ఉన్నా ఎవరికీ కేటాయించకుండా పాడుబెట్టారు, ఐటి పరిశ్రమకు కొత్త ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నందున మరో 10లక్షల చదరపు అడుగులు అవసరం అవుతుంది.
కాపులుప్పాడ లే అవుట్‌ను అభివృద్ధి చేసి ఐటి పరిశ్రమలకు కేటాయించాలి. గత ఐదేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ఇంధన చార్జీలు అధికంగా ఉన్నాయి, విపరీతంగా పన్నుల భారం మోపారు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ అందజేసి ఉపశమనం కలిగించాలి. విశాఖ ఎయిర్ పోర్టులో నైట్ ల్యాండిరగ్ పార్కింగ్ చార్జీలు మినహాయించాలి. రైల్వే జోన్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేయాలి, ఏవీజీసీ పాలసీ తెచ్చి గేమింగ్, యానిమేషన్ రంగాలను ప్రోత్సహించాలి. డిజిటల్ ఇన్ ఫ్రా అభివృద్ధి చేసి, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్‌కు కృషిచేయాలి. ఐటిలో తిరుపతిపై కూడా దృష్టి సారించాలి. విశాఖలో భూముల ధరలు విపరీతంగా ఉన్నాయి, రాయితీపై భూములను కేటాయించాలి. యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఎనలిటికల్ స్కిల్స్ పెంపుదలకు కృషిచేయాలి, కొత్త ఐటి పరిశ్రమల ఏర్పాటుకు సులభంగా అనుమతులు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈడీబీ ద్వారా ఐటి సమస్యలను పరిష్కరిస్తాం: లోకేష్
సమర్థవంతులైన వ్యక్తులతో ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడీబీ)ని ఏర్పాటు చేయబోతున్నాం. ఐటి పరిశ్రమదారులకు ఏ సమస్య వచ్చినా వారు వెంటనే పరిష్కరిస్తారని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. రాయితీపై భూకేటాయింపులపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. విద్యుత్, ఇతర పన్నుల భారాలపై సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం. నైట్ పార్కింగ్ చార్జీల మినహాయింపుపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులను పెంచుతాం. సింగపూర్ తరహాలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కు కృషిచేస్తాం. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తాం. గతంలో టిసిఎల్, డిక్సన్, జోహో వంటి పరిశ్రమలను తెచ్చిన విధంగానే కొత్త పరిశ్రమలను అక్కడకు రప్పిస్తాం. రాష్ట్రంలో అతిపెద్ద టాక్స్ పేయర్ అయిన అమర్ రాజాను గత ప్రభుత్వం వేధించి ఇబ్బందులకు గురిచేసింది. పరిశ్రమదారుల్లో నమ్మకం పెంచేందుకు కృషిచేస్తాం.
తిరుపతిలో కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు రాబోతున్నాయి. ఎంఎస్‌ఎంఇ రంగాన్ని కూడా పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఈ రంగంలో ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఐటి రంగ ప్రముఖులు సహకరించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో ఏపీ ఐటి అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ ప్రసాద్, ఇన్ఫోసిస్ ప్రతినిధి సురేష్, ఐటి కంపెనీల ప్రతినిధులు కార్తీక్, కిరణ్, మల్లిక, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.