కడప,అమరావతి: కడప నగరంలోని అగాడివీధిలో బుధవారం మధ్యాహ్నం వీధిలో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన్వీర్ (11) ఆదాం(10) అనే విద్యార్థులు సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. రోడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు స్పందించి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తన్వీర్ మృతి చెందాడు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యుత్ తీగలు తగిలి తన్వీర్ అనే చిన్నారి మృతి చెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించానన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.