- ఆర్టీసీ బస్సుల్లో త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం
- మంత్రి మండిపల్లి వెల్లడి
అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణాశాఖను సమూలంగా ప్రక్షాలిస్తామన్నారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామన్నారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీలో 7 వేల మంది సిబ్బంది కొరత ఉందని.. భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుటుందని తెలిపారు. వైసీపీ పాలనలో ఆర్టీసీలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల 2019-24 మధ్య ఆర్టీసీ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు.
ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అమరావతి బ్రాండ్ ఎసీ బస్సులకు పూర్వవైభవం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. ఆర్టీసీ బస్సులు , బస్టాండ్లలో పరిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించి వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఈనెల 12న మరోసారి సీఎం సమీక్షిస్తారన్న ఆయన.. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై సీఎం చర్చిస్తారని చెప్పారు.
రవాణా శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రవాణా శాఖలో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సీరియస్ అయ్యారు. గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల విలువ చేసే చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లిందని ఆరోపించారు. అక్రమంగా వెళ్తున్న వాహనాలను ఎందుకు నిలువరించలేకపోయారని ఆర్టీఏ అధికారులను ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో అక్రమంగా ఇసుక, ఖనిజాలు తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమంగా రేషన్ బియ్యం, ఇసుక, ఇతర ఖనిజ సంపద తరలించే వాహనాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీలో ఒకే నెంబర్‌తో పలు వాహనాలు తిరుగుతున్నాయని వాటిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నిరంతరం తనిఖీలు చేసి అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఎ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖను సమూలంగా ప్రక్షాళిస్తామని స్పష్టం చేశారు. అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిరచారు.