- రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఆసక్తి
- సీఎం చంద్రబాబుతో ప్రతినిధులు భేటీ
అమరావతి (చైతన్య రథం): ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విన్ ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, సంస్థ ప్రతినిథులు సమావేశమైనట్లు మంత్రి టిజి వెల్లడిరచారు. పరిశ్రమల మంత్రిగా విన్ ఫాస్ట్ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందన్నారు. వియత్నాంలో ఎంతో పేరుగాంచిన ఈ సంస్థ ఏపీలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కానీ కృష్ణపట్నంలో కానీ ఎలక్ట్రానికి వెహికల్, బ్యాటరీ తయారీ ప్లాంట్ను పెట్టే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్నివిధాలా అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు కల్పనకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. 30 రోజుల తర్వాత రాయితీలపై చర్చించి అంతా ఒకే అయితే కంపెనీ ఎక్కడ ఏర్పాటుచేసే విషయం తెలుస్తుందన్నారు. చంద్రబాబు సీఎం అవ్వడంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి తరలివస్తున్నారన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులకు విందు ఇచ్చారని మంత్రి తెలిపారు.