- జనసేన అగ్రనేతతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి భేటీ
- రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా బలమైన అడుగులు
- ప్రజాక్షేత్రంలో కూటమి సుస్థిరం కావాలి
- భేటీలో పల్లా `పవన్ కల్యాణ్ సంయుక్త నిర్ణయం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులమధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు నిర్ణయించాయి. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ శనివారం పొద్దుపోయిన తర్వాత ఆయన నివాసంలో గంటన్నరపాటు ఆత్మీయ సమావేశం సాగించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి శ్రేణుల్లో ఎక్కడ పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని ఇరువురు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత బలోపేతం చేస్తూనే.. క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ లక్ష్యం.. మోడీ ఆశీస్సులతో ఏర్పాటైన కూటమికి ప్రజలు అప్రతిహత విజయాన్ని అందించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
జన సైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన రణోత్సాహం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమష్టి కృషి, బీజేపీ అభిమానుల ఆదరణ సమష్టిగా రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పునకు అనుగుణంగా సుదీర్ఘకాలం మైత్రి కొనసాగేలా క్షేత్రస్థాయిలో చర్యలుండాలని ఇరువురి నేతల ఆకాంక్షించారు. దీనికి అనుగుణమైన కార్యాచరణ రూపొందించుకుని నిరంతరం పర్యవేక్షించుకోవాలని నిర్ణయించారు. ఎక్కడైనా బేధాభిప్రాయాలు తలెత్తుతాయన్న సూచనలు కనిపించిన వెంటనే సరిదిద్దేలా మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం ద్వారా గత పాలనలో జరిగిన అరాచకాన్ని ప్రజలు మరింత అవగతం చేసుకునేలా కూటమి శ్రేణులు వ్యవహరించాలని తెదేపా, జనసేనలు నిర్ణయించుకున్నాయి.