- జనం ఛీకొడుతున్నా అదే ఏడుపు
- విషపుత్రిక సాక్షిలో రోత రాతలు
- నిస్సిగ్గుగా అబద్ధాల ప్రచారం..
- అమలవుతోన్న హామీలపై అక్కసు
- డిఎస్సీపై నోరు కుట్టేసుకున్న జగన్
- కనీస మర్యాదను విస్మరిస్తోన్న వైనం
- ఓటమినుంచి పాఠాలు నేర్వని వైకాపా
- పగతో ప్రజా ప్రభుత్వంపై విమర్శలు
అమరావతి (చైతన్యరథం): పనీ పాటా లేనివాడు పిల్లి తల గొరిగాడన్న తెలుగు సామెతకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. సార్వత్రిక ఎన్నికలలో ఛీకొట్టిన జనం, వైకాపాను 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసినా `ఆ పార్టీలో ఆత్మపరిశీలన ఆనవాలుకి కూడా కనిపించడం లేదు. ఓటమి పరాభవం తరువాత వారంపాటు రాష్ట్ర ప్రజలకు ముఖం చాటేసిన జగన్ `ఇప్పుడు జనంలోకి వచ్చి ప్రజా ప్రభుత్వంపై అదేపనిగా విషం చిమ్ముతున్నారు. అధికారంలోవున్న ఐదేళ్లూ అబద్ధాల పాలనకే ప్రాధాన్యమిచ్చిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు విషపుత్రిక సాక్షిలో రోత రాతలకు తెగబడటం పార్టీ నాయకుడిగా స్థాయి దిగజార్చుకోవడమే. నిర్మాణాత్మక విమర్శకు ఏనాడూ తావివ్వని జగన్.. పచ్చి అబద్ధాల ప్రచారాలతో ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. ప్రజా ప్రభుత్వం కుదురుకుని పక్షం రోజులు కాకమునుపే `ఎన్నికల హామీలు అమలు కావడం లేదంటూ విష ప్రచారానికి దిగడం జగన్‌కే చెల్లింది. పార్టీ ఓటమి ఖాయమని, సీఎం సీటు ఖాళీచేయక తప్పదని ముందే గ్రహించిన జగన్‌రెడ్డి.. అంతకుముందే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారు. రాష్ట్రం నెత్తిన 13లక్షల రూపాయల అప్పుల కుంపటి పెట్టారు. ఇవి చాలదన్నట్టు రూ.రెండు లక్షల కోట్ల బిల్లులకూ బకాయి పెట్టింది జగన్ సర్కారు. అవ్వతాతలు, స్కూలు పిల్లలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ఆకాంక్షలను కాలరాసిన జగన్, అస్మదీయులకు ఆగమేఘాలమీద బిల్లులు బట్వాడా చేయించడం ప్రజలు గ్రహించకపోలేదు. ఆర్థికంగా రాష్ట్రానికి కొన ఊపిరి కూడా తీసేసి వెళ్లిన జగన్.. కొత్త ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదంటూ నిస్సిగ్గు ప్రకటనలు చేయడం రాజకీయ వక్ర సంప్రదాయానికి పునాధులు వేయడమే.
రాజకీయ మర్యాద విస్మరించిన జగన్
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్న ముఖ్యమంత్రిపై పసలేని విమర్శలకు దిగడం జగన్ అక్కసుకు పరాకాష్ట. అమలవుతున్న సంక్షేమ హామీలు జగన్ వక్రదృష్టికి కనిపించడం లేదా? అంటూ రాష్ట్ర ప్రజలే నిలదీస్తున్నారు. ఎన్నికల ప్రచార ఘట్టంలో ఎన్ని సైద్ధాంతిక విమర్శలు గుప్పించినా, ఫలితాల తరువాత కూటమి నాయకుడు చంద్రబాబు ఒక్క విమర్శా చేసింది లేదు. పైగా `ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే ఎన్నికల విభేదాలకు స్వస్తిపలకాలని ప్రకటించి.. పాలకుడిగా, ప్రభుత్వాధినేతగా రాజకీయ మర్యాదను పాటించారు. ఓటమి అక్కసుతో వైకాపా మూకలు అధికారపార్టీ శ్రేణులపై విరుచుకుపడి దాడులకు దిగినా ప్రభుత్వాధినేత సంయమనం కోల్పోలేదు. చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆదేశించారే తప్ప, పగను ప్రదర్శించి ప్రతిష్టను దిగజార్చుకోలేదు. ఇందుకు విరుద్ధమైన ప్రవర్తనను ప్రదర్శిస్తూ.. ముఖ్యమంత్రిపై అర్థరహితం, అసత్యాలను ప్రచారం చేయడం జగన్ ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టించడానికే తెదేపా శ్రేణులు ఈ తరహా దాడులు చేస్తున్నాంటూ ఎదురుదాడికి దిగడం.. జగన్‌రెడ్డి నీచ రాజకీయాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఒకవైపు దుష్ట సాంప్రదాయానికి బీజాలు వేస్తూనే.. చంద్రబాబూ మీరు వేసే చెడు సాంప్రదాయ బీజం రేపు కార్యకర్తలకూ చుట్టుకొంటుందంటూ తాటాకు చప్పుళ్లు చేయడం జగనుకే చెల్లింది. ‘ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరన్న విషయాన్ని గుర్తెరగండి. శిశుపాలుని పాపాలు మాదిరిగా పాపాలు పండుతున్నాయి. అధికారం మారిన రోజున మీరు చేస్తున్న చెడు సాంప్రదాయం మీకే చుట్టుకుంటుందం’టూ జగన్ చేస్తోన్న నీతి ప్రేలాపనలు రోతపుట్టించేవే. ‘రాష్ట్రవ్యాప్తంగా భయోందోళనలు సృష్టించే దుశ్చర్యలను ఆపాలి’ అని, వివిధ కేసులలో తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడు ప్రజా ప్రభుత్వాన్ని హెచ్చరించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే!
వాస్తవాలను జీర్ణించుకోలేక..
గత పాలకుడి ఐదేళ్ల ఏలుబడిలో రాష్ట్రం ఎంత ఛిద్రమైందో లెక్కలతో సహా బయటపెడతానని ఎన్నికల ప్రచార ఘట్టంలోనే ప్రకటించిన చంద్రబాబు.. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్రానికి సంభవించిన నష్టాలపై దృష్టిపెట్టారు. ఐదేళ్ల రాక్షస పాలనలో రాష్ట్రమెంతగా నష్టపోయిందో లెక్కలు సహా ‘శ్వేతపత్రాల’తో ప్రజల్లో చర్చకు పెడుతున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. విద్యుత్ సహా మరో ఐదు ముఖ్య వ్యవస్థలపైనా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. దేశంలోనే దారుణ విధ్వంసక పాలన అందించిన జగన్‌రెడ్డి బాగోతం ప్రజలముందు బట్టబయలు చేస్తున్నారు. ఇదే జగన్‌రెడ్డి జీర్ణించుకోలేక పోతున్న విషయం. పైగా `ఐదేళ్ల విలువైన కాలాన్ని ‘డేరా పాలన’కు పరిమితం చేసిన జగన్‌రెడ్డి.. ప్రజా ప్రభుత్వాధినేతగా చంద్రబాబు అనుక్షణం ప్రజలమధ్య ఉండటం కూడా జగన్‌కు కంటగింపైంది.
అమలవుతోన్న హామీలపై అక్కసు
‘ఆడబిడ్డ నిధి’ కింద అర్హులైన మహిళలకు రూ.1500 ఇస్తామన్న చంద్రబాబు `హామీని తుంగలో తొక్కారంటూ విషపుత్రిక సాక్షిలో రోతరాతలు రాయడం.. జగన్ రాజకీయ దిగజారుడుతనమే. రాష్ట్రంలో రెండుకోట్ల మహిళా ఓటర్లున్నారని, వితంతు పింఛనుదారులను పక్కనపెడితే, 1.72 కోట్లమంది ఆడబిడ్డలకు నిధి ఇవ్వకుండా దగా చేస్తున్నారన్న ‘సాక్షి’ రాతలను చూసి ప్రజలే నవ్వుతున్నారు. పాలనమీద, ప్రభుత్వ విధానాలమీద, అర్హులను గుర్తించడంపైనా.. జగన్‌కు ఏమైనా అవగాహన ఉందా? అన్నది ప్రజలు సంధిస్తోన్న ప్రశ్న. నిరుపేద జగన్ భార్య భారతి కూడా రాష్ట్రంలో ఓటరు కనుక `ఆమెకూ ఆడబిడ్డ నిధికింద రూ.1500 ఇచ్చి తీరాలన్న రీతినవుంది సాక్షి వాదన. పీఠమెక్కగానే మాటమేరకు ఐదు సంక్షేమ హామీలపై క్షణాల్లో సంతకాలు చేయడమే కాదు, అమలునూ ఆరంభించిన చంద్రబాబుపై విమర్శలు గుప్పించే నైతిక హక్కు జగన్‌కు ఉందా? వాలంటీర్ల ముసుగులోవున్న జగన్ పార్టీ సేవకులను పక్కనపెట్టి.. గ్రామ సచివాలయ ఉద్యోగులతో అరపూటలో 65 లక్షలమందికి పింఛన్లు అందించిన చంద్రబాబుపై జగన్ బురదజల్లుడుని ఏమనాలి? చివరి రెండు నెలల పింఛను ఇవ్వడానికి అవ్వతాతలను ముప్పుతిప్పలు పెట్టి 60మంది ఉసురు తీసిన రాక్షస పాలకుడికి.. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే హక్కుంటుందా?
డిఎస్సీపై జగన్ నోరువిప్పడే?
ఐదేళ్ల పాలనలో భ్రష్టుపట్టించిన విద్యా వ్యవస్థను కేవలం పక్షం రోజుల్లో ప్రక్షాళన చేసిన ప్రజా ప్రభుత్వం ఘనతపై జగన్ నోరు విప్పరెందుకు? ఐదేళ్ల పాలనాకాలంలో ఏనెలా ఫస్ట్ తారీఖున ఉద్యోగులకు జీతాలివ్వని జగన్.. ఆ పనిని ప్రజా ప్రభుత్వం నిర్వర్తిస్తే మాట పెగలదెందుకు? ఖజానా ఖాళీ చేసి వెళ్లిన వ్యక్తికి.. ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలిచ్చిన చంద్రబాబును విమర్శించే స్థాయి ఉంటుందా? ఎన్నికల్లో మాటిచ్చి.. సీఎం బాధ్యతలు స్వీకరించగానే 16వేల పోస్టులతో డిఎస్సీ వేసిన చంద్రబాబుకి.. ఇదిగో అదిగో అంటూ డిఎస్సీ వేయకుండా ఐదేళ్లు డ్రామాకట్టిన జగనుకూ ఏమైనా సామీప్యముందా? గత ఎన్నికల మేనిఫెస్టోలో 740 హామీలిచ్చి 80శాతం ఎగ్గొట్టిన జగన్.. ప్రజా ప్రభుత్వమిచ్చిన హామీలపై ప్రశ్నించడం సిగ్గుచేటు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల మాదిరి వేగంగా పరిగెత్తిస్తున్న ప్రజా ప్రభుత్వం ప్రతిష్టను ఓర్వలేకపోతున్న జగన్.. సాక్షి రోతరాతలతో విషజిమ్మడం ఆయన పతనానికి ఆయనే గోతులు తీసుకోవడంలాంటిది.